బూతుల నాని ఖాతాలో భారీ కుంభకోణాలు.. కూపీ లాగుతున్న విజిలెన్స్!?
posted on Nov 27, 2024 3:18PM
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఆయన శాఖ ఏమిటి అన్నది కూడా ఎవరికీ తెలియదు. కానీ జనం మాత్రం ఆయనను అప్పట్లో బూతుల సరఫరా శాఖ మంత్రి అనే భావించేవారు. అయినా కొడాలి నాని తన అవినీతి, అక్రమాలతో, బూతు భాషా ప్రావీణ్యంతో యమా గుర్తింపు పొందారు. అయితే ఆయన యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడినా, నోటిని అదుపులో ఉంచుకోవడం అంటే ఏమిటో తలియనట్లుగా ప్రత్యర్థి పార్టీల నేతలపై మరీ ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ పై బూతుల ప్రవాహాన్ని తలపించేలా తన వాగ్ధాటిని ప్రదర్శించినా అదంతా వైసీపీ అధికారంలో ఉన్నంత కాలమే.
వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత కొడాలి నాని చాలా వరకూ నోటికి తాళం వేసేసుకున్నారు. అధికారంలో ఉండగా తమ పార్టీ అధినేత జగన్ పరదాలు కట్టుకుని మరీ ప్రజల ముందుకు వెళ్లినట్లు ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కొడాలి నాని ప్రజలకు కనిపించకుండా ముఖం దాచేసు కుంటున్నారు. ఓ సారి తిరుపతిలో కొత్త అవతారంతో దర్శనమిచ్చారు. ఆ తరువాత కూడా ఒకటి రెండు సందర్భాలలో తన ట్రేడ్ మార్కు గడ్డం లేకుండా పబ్లిక్ లో కనిపించారు. నోట్లో గుట్కా, చెంపలు కనిపించకుండా గడ్డంతో ఉంటేనే ఎవరైనా కొడాలి నానిని గుర్తుపట్టగలరని ఆయన భావిస్తున్నారేమో. అక్కర్లేదు బూతులు లేకుండా ఓ రెండు నిముషాలు మాట్లాడితే ఆయన నేను కొడాలి నానినే అని చెప్పినా జనం నమ్మరు. అంతలా ఆయన తన బూతు భాషా ప్రావీణ్యంతో మమేకమైపోయారు.
సరే ఇదంతా పక్కన పెట్టేస్తే.. ముసలిదైపోయిన పులి మాంసాహారం మానేశానని చెప్పినట్లు ఇప్పుడు అధికారం అండ లేని నాని బూతులు మానేశాను. ఇక అవినీతి పనులకు పాల్పడను అని చెప్పినంత మాత్రాన చేసిన తప్పులు ఒప్పైపోతాయా? కర్మ అనుభవించక తప్పదు కదా? కొడాలి నాని విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇసుక మాఫియా, రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ స్కాములలో కొడాని నాని ప్రమేయం ఇప్పుడు బయటకు వచ్చింది.
వీటికి తోడు గుడివాడ నియోజకవర్గంలో రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణానికి రూ. 40 కోట్లు శాంక్షన్ చేయించుకున్న కొడాలి నాని వాటిలో ఇళ్ల నిర్మాణానికి కేవలం ఏడు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టులన్నీ నాని బినామీలే దక్కించుకున్నారనీ వెల్లడైంది. ఈ నిర్మాణాలకు విడుదలైన 40 కోట్ల రూపాయలలో కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవ్వగా మిగిలిన 33 కోట్ల రూపాయలనూ నాని అండ్ గ్యాంగ్ బొక్కేశారని తేలింది. ఈ కుంభకోణంలో కొడాలి నాని అనుచరులు దుక్కిపాటి శశిభూషణ్, పాలెడుగు రామ్ ప్రసాద్, కుసికుర్తి బాబు, కొత్తి విజయ్ లను నిందితులుగా తేల్చిన విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. ఈ కుంభకోణాల వెనుక కొడాలి నాని ప్రమేయంపై కూపీ లాగుతున్నారు. రానున్న రోజులలో కొడాలి నాని సహా ఈ కుంభకోణాలలో ప్రమేయం ఉన్న అందరిపై చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.