ముదిరిపాకాన పడ్డ మహా రాజకీయం

మహారాష్ట్ర రాజకీయం ముదిరి పాకాన పడింది. ఓ వైపు అనూహ్య విజయం సాధించిన బీజేపీ కూటమి పార్టీలలోనూ విభేదాలు పొడసూపాయి. అలాగే ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ కూటమిలోనూ లుకలుకలు మొదలయ్యాయి. ముందుగా బీజేపీ కూటమి విషయానికివస్తే.. కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ కూటమిలో ముఖ్యమంత్రి పదవి కోసం కుమ్ములాటలు సాగుతున్నాయి. బీజేపీయే కలలో కూడా ఊహించని విధంగా కూటమిలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రధర్మం సంగతి పక్కన పెట్టి ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతోంది. ఏక్ నాథ్ షిండే సీఎంగా కొనసాగుతారన్న నమ్మకం, ఒప్పందంతోనూ కూటమి మహా ఎన్నికలకు వెళ్లింది. అయితే ఘన విజయం తరువాత బీజేపీ ప్లేట్ ఫిరాయించిందన్నది శివసేన షిండే వర్గం ఆరోపణ. అంతే కాదు షిండేను సీఎంను చేసి తీరాల్సిందేనని ఆయన వర్గం ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. షిండే గత రెండేళ్లుగా సాగించిన పాలనకు ప్రజామోదమే ఈ ఎన్నికలలో బీజేపీ కూటమి ఘన విజయానికి కారణమని చెబుతున్నారు.

అయితే బీజేపీ అధినాయకత్వం మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీ నే దేవెంద్రఫడ్నవిస్ నే సీఎం పీఠంపై కూర్చోపెట్టాలని పట్టుబడుతోంది. అదే సమయంలో ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా కన్ ఫర్మ్ అయ్యారని కూడా చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఏక్ నాథ్ షిండే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజ్యాంగం ప్రకారం మంగళవారం (నవంబర్ 26)తో అసెంబ్లీ గడువు ముగియడంతో ఎగ్జిస్టింగ్ ప్రభుత్వం గద్దె దిగి కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంది. అయితే సీఎం ఎవరన్న విషయం తేలకపోవడంతో షిండే రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. షిండే తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేయడానికి రాజ్ భవన్ కు వెళ్లిన సందర్భంగా ఆయన బాడీ లాంగ్వేజ్ గమనించిన ఎవరికైనా ఆయన హ్యాపీగా లేరన్న విషయం స్పష్టమౌతుంది. 

షిండేను సముదాయించడానికి బీజేపీ ఆయనకు భారీ ఆఫర్లు చేసిందని కూడా మహారాష్ట్ర రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. ఫడ్నవీస్ సర్కార్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు షిండే ఇష్టపడకుంటే.. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని కూడా బీజేపీ హై కమాండ్ ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. అయితే రాష్ట్ర రాజకీయాలకు దూరం కావడానికి షిండే ఇసుమంతైనా అంగీకరించడం లేదని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే విషయంలో జాప్యం జరుగుతోంది. 

మరో వైపు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ కూటమిలో కూడా లుకలుకలు మొదలయ్యాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ బలం పూర్తిగా దిగజారిపోయింది. అతి తక్కువ స్థానాలలో విజయం సాధించింది. దీంతో శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం అసెంబ్లీలో విపక్ష నేత హోదా కోసం పట్టుబడుతున్నారు. కూటమిలో పెద్ద పార్టీగా, కూటమికి నాయకత్వం వహించే పార్టీగా కాంగ్రెస్ అందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇక శరద్ పవార్ అయితే కూటమిలో కొనసాగే విషయంలోనే విముఖంగా ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహావికాస్ అఘాడీ ఐక్యంగా కొనసాగే విషయంలో సర్వత్రా అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.