ఎర్రచందనం ఎగుమతులు, విక్రయాలకు సింగిల్ విండో!
posted on Nov 27, 2024 4:35PM
ఎర్రచందనం ఎగుమతులు, విక్రయాలను సింగిల్ విండో విధానానికి మార్చాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్రయాదవ్ ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్ తో బుధవారం (నవంబర్ 27) భేటీ అయ్యారు. ఆ సందర్భంగా అత్యంత అరుదైన ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలో మాత్రమే లభ్యమౌతుందనీ, అందుకని కేంద్రం నిబంధనలను సవరించి ఏపీ వెలుపల పట్టుబడిన ఎర్రచందనాన్ని సైతం సింగిల్ విండో లో భాగంగా ఏపీ రాష్ట్రానికే దక్కేలా చేయాలని కోరారు.
ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాలపై పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రితో విస్తృతంగా చర్చించారు. మంత్రితో చర్చించారు. ఎర్రచందనం విషయంలో సింగిల్ విండో విధానానికి ఏపీ అటవీ శాఖ కస్టోడియన్ గా ఉండేలా చేయాలని పవన్ కల్యాణ్ ఆ సందర్బంగా ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఎర్రచందనం గ్రేడింగ్, వేలం, ఎగుమతి సాగించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పట్టుబడినా కేంద్రం పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ ద్వారానే అమ్మకాలు, ఈ వేలం సాగే విధంగా సింగిల్ విండో విధానాన్ని తీసుకురావాలని పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రిని కోరారు.