నల్లారి చేరిక.. బీజేపీకి లాభమేనా?
posted on Apr 7, 2023 2:33PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ కీలక ఘట్టం. మాజీ ముఖ్యమంత్రి, సమైక్యాంధ్ర చివరి సీఎం అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి.. 2004-09 మధ్య అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ పనిచేశారు.
ఆ తర్వాత 2009- 10లో ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2010-2014 మధ్య ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో... రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి సమైక్యాంధ్ర పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ లో చేరారు. 2014 తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వచ్చిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. మళ్లీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. కొన్ని రోజుల కిందట కాంగ్రెస్ కు మళ్లీ గుడ్ బై చెప్పిన ఆయన.. ఇప్పుడు బీజేపీలో చేరారు.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి జనాదరణ దాదాపుగా శూన్యం. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం వల్ల ఇప్పుడు ఆ పార్టీకి కొత్తగా ఒరిగేది ఏమీ లేదు.. ఉనికే లేని పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి చేరిక వల్ల ఎవరికీ ఏ విధంగానైనా లాభం లేదు. ఆయనకు రెండు రాష్ట్రాలో కూడా ఎలాంటి క్యాడర్ లేదు. చాలా కాలంగా పాలిటిక్స్ కు దూరంగా ఉండటంతో ఆయనకు ప్రత్యేక వర్గం అంటూ లేదు. త్వరలో ఎన్నికలొస్తున్నాయి.. అందుకు ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉండటం బెటర్ అని భావించి చేరితే.. అది వేరే విషయం..కానీ ఆయన చేరిక వల్ల బీజేపీకి ఒరిగేది మాత్రం ఏం లేదంటున్నారు పరిశీలకులు?