వైసీపీ ముక్త ఏపీ కోసమే ఆ కలయిక: రఘురామ రాజు

వైసీపీ ముక్త ఏపీ లక్ష్యంగా ఆ మూడు  పార్టీలు కలిసి పని చేయడం ఖాయమని ఆ పార్టీ రెబల్ ఎంపీ రామకృష్ణంరాజు అన్నారు. రచ్చబండలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన జనసేనానిని పవన్ కల్యాణ్ పొత్తులపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీల నివ్వను అని చెప్పడం కంటే ఇంకేం చెప్పాలని ప్రశ్నించారు.  

పవన్ కళ్యాణ్ ఢిల్లీ లో బిజెపి పెద్దలతో జరిగిన సమావేశం లో ఏమి మాట్లాడారో నన్న టెన్షన్ జనసేన, తెలుగుదేశం శ్రేణులలో కంటే వైసీపీ నాయకత్వంలోనే ఎక్కువగా కనిపించిందన్న రఘురామ రాజు.. అది చాలదా జగన్ పార్టీలో ఓటమి భయం ఎంతగా గూడుకట్టుకుందో తెలియడానికి అని ప్రశ్నించారు.  టిడిపి తో పొత్తు గురించి బిజెపి పెద్దలతో మాట్లాడారా? అన్న మీడియా ప్రశ్నకు రాజకీయాలంటే అన్నీ మాట్లడుకుంటాంగా అన్న సమాధానం తరువాత కూడా పొత్తులపై అనుమానాలు వ్యక్తం చేసేవారు బుద్ధిహీనులూ ఔతారని రఘురామ అన్నారు.  

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి 40% ఓటు బ్యాంకు గతంలోనే ఉన్నది.  సరైన సమయం లో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ నాయకత్వం కూడా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం స్పందిస్తుంది. జనాల సంక్షేమమే ముఖ్యం కానీ జగన్ సంక్షేమం కాదన్న విషయం ఆ పార్టీ నాయకత్వానికి కూడా తెలుసునని, అందుకే  వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి, జనసేన, బిజెపిలు కలిసి పోటీ చేస్తాయని బిజెపి పెద్దలు మురళీధరన్, శివ ప్రకాష్ జి , నడ్డాలతో నాదెండ్ల మనోహర్ , పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం ప్రగాఢ విశ్వాసంతో , రెట్టించిన ఉత్సాహంతో చెబుతున్నానని రఘురామకృష్ణంరాజు తెలిపారు. 

రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి, జనసేన లతో బిజెపి కలయికపై ఎటువంటి సందేహాలను పెట్టుకోవలసిన అవసరం లేదని   తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కుటుంబ సమేతంగా కలిసే అవకాశం టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమెడల రవీందర్ కుమార్ కు లభించింది.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని అధ్వాన శాంతి భద్రతల పరిస్థితులను రవీంద్ర కుమార్ ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, రాష్ట్రాన్ని కాపాడ వలసిందిగా కోరారు. దానికి ప్రధానమంత్రి స్పందిస్తూ ,అవును…ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి పంజాబ్ మాదిరి గానే ఉన్నదని వ్యాఖ్యానించడం ద్వారా రవీందర్ కుమార్ వాదనలతో ఆయన ఏకీభవించినట్లయిందన్నారు.   టిడిపి, జనసేన, బిజెపి కలిస్తే మాడు పగులుతుందని, బాక్స్ బద్దలవుతుందని, కొంప కొల్లేరవుతుందన్న ఆందోళనలో వైసీపీ అగ్రనాయకత్వం ఉందని అన్నారు.