విడదల రజని మెరుపులు.. మరకలు

ఏ రోటి దగ్గర ఆ పాటే పాడాలి... అదీ ఏ పాట అయినా సరే...  ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి... అది ఏ రంగు గొడుగు అయినా సరే.. అలా అయితేనే రాజకీయం చేయగలం.. అలా అయితేనే.. ఇలా పార్టీ మారి... అలా ఎమ్మెల్యే టికెట్ చేజిక్కించుకోవడం కోసం అప్పటి వరకు సంవత్సరాలకు సంవత్సరాలుగా... క్యూలో నిలబడి వేచి చూస్తున్న వారిని సైతం వెనక్కి నెట్టి మరీ ఎమ్మెల్యే టికెట్.. అదీ కూడా పైసా ఖర్చు లేకుండా సంపాదించేయవచ్చు. అలా దశ మహా విద్యలను మించిన ఆ మహిమాన్విత విద్య తెలిస్తే... రాజకీయాల్లో రాణించవచ్చని... అందులో కూడా ఎక్కడ అడ్డు అదుపూ.. ఆపూ లేకుండా దూసుకుపోవచ్చు అనేందుకు తాజా ఉదాహరణ చిలకలూరిపేట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ అని సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

చిలకలూరిపేటలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  జగన్ గురువారం (ఏప్రిల్ 6) ప్రారంభించారు. ఈ సందర్భంగా బీసీ మహిళనైన తనకు రాజకీయ భిక్ష పెట్టిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణ పడి ఉంటానంటూ విడదల రజినీ భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై ఆమె సంధించిన వ్యంగ్యస్త్రాలను సైతం నెటిజన్లు తమ దైన శైలిలో విశ్లేషిస్తున్నారు.  అయితే జై జగనన్న.. జై జై జగనన్న.. మన చిలకలూరిపేటలో మనమంతా..జగనన్నా అని పిలిస్తే.. ఎక్కడో ఉన్న చంద్రబాబు ఉలిక్కిపడాలా.. అంటూ విడదల రజినీ చేసిన వ్యాఖ్యలు.. ఏదో సినిమా డైలాగ్‌ను కాపీ కొట్టినట్లుగా ఉందని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.  అదీకాక.. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదని.. జగనన్న గెలుపు తథ్యమని ఆమె చెప్పిన జోస్యం పట్ల నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

అయితే ఓ సారి గతాన్ని గుర్తు చేసుకోవాలని మంత్రి విడదల రజినీకి సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు సూచిస్తున్నారు. 2014 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలుగుదేశం పార్టీ  విజయం కోసం... సోషల్ మీడియాలో పని చేసేందుకు అమెరికా నుంచి వచ్చిన అతికొద్ది మందిలో   విడదల రజినీ ఒకరని వారు వివరిస్తున్నారు. ఆ క్రమంలోనే... అంటే 2017లో విశాఖపట్నంలో జరిగిన మహానాడు వేదికపై నుంచి విడదల రజినీ మాట్లాడుతూ.. నేను మీరు నాటిన మొక్క సార్..  సైబరాబాద్‌ మొక్క సార్ అంటూ చంద్రబాబు ఎదుటే మాట్లాడిన రజనీ..  అప్పట్లో నరకాసురులు ఎలా ఉంటారని ఎవరైనా అడిగితే.. ప్రతిపక్ష   జగన్,  ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలాగా ఉంటారని ఉదాహరణగా చూపించాలంటూ.. మైక్ అదిరేపోయేలా చెప్పిన సంగతిని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 

అయితే ఆ తర్వాత టీడీపీ నుంచి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించడం.. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో చేసేది లేక.. 2018లో జగన్ పార్టీలోకి ఆమె ఇలా జంప్ కొట్టి.... అలా అసెంబ్లీ టికెట్ తీసుకొని.. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడమే కాదు.. జగన్ మలి కెబినెట్‌లో అత్యంత కీలక శాఖల్లో ఒకటైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారని... అలాగే రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన జిల్లా విశాఖపట్నం అని.... ఆ జిల్లాకే ఇన్‌చార్జ్ మంత్రిగా ఆమె కొనసాగుతున్నారని వారు వివరిస్తున్నారు.
 
ఇదే విడదల రజినీ... నాడు మహానాడు వేదికగా చంద్రబాబు సమక్షంలో అలా మాట్లాడితే.. నేడు జగన్న సభలో ఇలా మాట్లాడారంటూ.. నెటిజన్లు ఈ సందర్భంగా వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అదీకాక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో.. ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు గెలుపొందాలని.. లేని పక్షంలో కేబినెట్‌లో మార్పులు చేర్పులు తప్పవంటూ ఇటీవల జరిగిన కెబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి  జగన్ క్లియర్ కట్‌గా స్పష్టం చేశారనే కథనాలు అయితే మీడియాలో హల్‌చల్ చేశాయి. అలాంటి వేళ.. రేపో మాపో జగన్ కేబినెట్‌ను మూడో సారి విస్తరించే అవకాశాలు ఉన్నాయని.... ఈ నేపథ్యంలో పార్టీ అధినేత  జగన్ ముందరి కాళ్లకు బంధం వేసేలా మంత్రి విడదల రజనీ మాటలు మంత్రించి వదిలారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

అదీకాక 2019 ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేగా విడదల రజినీని గెలిపిస్తే.. చిలకలూరిపేట నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీగా గెలిపించి.. తన కేబినెట్‌లో మంత్రిని చేస్తానంటూ ప్రతిపక్ష నేతగా  జగన్ ప్రకటించారని.. అయితే ఆ ఎన్నికల్లో విడదల రజినీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారనీ, అయితే  మర్రి రాజశేఖర్‌కు నిన్న మొన్నటి వరకు ఎటువంటి పదవి  దక్కలేదు  కానీ ఇటీవల ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మర్రి రాజశేఖర్‌ ఎమ్మెల్సీగా గెలుపొందారని..  మరోవైపు  మర్రి రాజశేఖర్‌ సామాజిక వర్గానికి చెందిన వారు..  జగన్ మలి కెబినెట్‌లో ఒక్కరు కూడా లేరని.. ఈ నేపథ్యంలో ఒకే నియోజకవర్గంలో ఇద్దరికి కెబినెట్‌లో చోటు ఉండదు కాబట్టి.. మంత్రి పదవి నుంచి రజినీని తప్పించి... ఆ స్థానంలో మర్రి రాజశేఖర్‌ను తీసుకొనే అవకాశం అయితే ఉందనే ఓ చర్చ అయితే ప్రస్తుతం  నెట్టింట జోరుగా సాగుతోంది.

మరోవైపు ఇదే చిలకలూరిపేట  నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలకు సంబంధించి హైకోర్టు జారీ చేసిన నోటీసులు..  జగన్ సోదరుడు కడప ఎంపీ  అవినాష్ రెడ్డి బంధువులతోపాటు మంత్రి విడదల రజినీ కూడా అందుకోన్నారని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. 

ఏదీ ఏమైనా ఎటువంటి అండ.. దండా..  హంగు.. ఆర్భాటం లేకుండా.. చాలా సింపుల్‌గా 2014లో టీడీపీ గెలుపు కోసం పని చేసి.. ఆ తర్వాత జగన్ పార్టీలోకి జంప్ కొట్టి... ఎమ్మెల్యేగా గెలుపొంది.. మంత్రి పదవి అందుకోవడం అంటే చాలా ప్రతిభ పాటవాలు ఉండాలని.. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. మహానటి అవతారం ఎత్తాలని అలా అయితేనే రాజకీయాల్లో రాణింపు ఉంటుందని స్పష్టమవుతోందని సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు సెటైరికల్‌గా కామెంట్ చేస్తున్నారు.