అడవిబిడ్డకు అందలం... మిరియాల శిరీష...!

ఎక్కడో రంపచోడవరం దగ్గర గిరిజన గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేసే ఒక యువతి ఎమ్మెల్యే అవుతుందని ఎవరైనా ఊహించగలరా? ఎవరో వేరేవారు ఊహించడం కాదు.. సాక్షాత్తూ ఆ యువతి కూడా ఊహించలేదు. ప్రజలకు సేవ చేయాలన్న తపన.... ఊహించడానికి కూడా వీలుకాని విషయాన్ని నిజం చేసింది. ఒక సామాన్యురాలిని అసామాన్యురాలిగా మార్చింది.. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపింది. ఆమె ఎవరో కాదు.... రంపచోడవరం తెలుగుదేశం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి.

రంపచోడవరం నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికలలో వరుసగా విజయం సాధించిన సీనియర్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి మీద.... రాజకీయ నేపథ్యం లేని, రాజకీయాలంటే ఎంతమాత్రం అవగాహన లేని మిరియాల శిరీష దాదాపు పదివేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక సంచలన విజయం. ఆర్థికంగా బలం, రాజకీయంగా బలగం వున్న చాలామంది ఓటమిపాలైన ఈ ఎన్నికలలో ఒక సామాన్య యువతి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు.. ఆనాడు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పుడు ఇలాంటి సామాన్యులనే తన తోటి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి తీసుకెళ్ళారు. ఇప్పుడు అదే బాటలో మిరియాల శిరీషను అసెంబ్లీకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్‌కి దక్కింది. 

రాజవొమ్మంగి మండలం అనంతగిరికి చెందిన మిరియాల శిరీష గిరిజన కోయ తెగకు చెందిన యువతి. బీఈడీ పూర్తి చేసిన తర్వాత తన ప్రాంతంలోనే అంగన్‌వాడీ టీచర్‌గా ఉద్యోగాన్ని సంపాదించారు. ఉద్యోగ నిర్వహణలో ఆమెకు అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల మీద పూర్తి అవగాహన ఏర్పడింది. అలాగే స్థానిక సమస్యల విషయంలో కూడా శిరీషకు పూర్తి అవగాహన వుంది. శిరీష భర్త మఠం విజయభాస్కర్ తెలుగుదేశం పార్టీలో చురుకైన కార్యకర్త. 

నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర నిర్వహించిన సందర్బంగా శిరీష తన భర్తతో కలసి వెళ్ళి నారా లోకేష్‌ని కలిశారు. అక్కడ లోకేష్, శిరీష మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. రంపచోడవరం ప్రాంత ప్రజలు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావన వచ్చింది. స్వతహాగా ధైర్యవంతురాలైన శిరీష... లోకేష్‌తో మాట్లాడుతున్న సందర్భంలో, రంపచోడవరం ఎమ్మెల్యే టిక్కెట్ తనకు ఇస్తే ఇక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శిరీష అన్నారు. అది విని నారా లోకేష్ నవ్వి ఊరుకున్నారు.

శిరీష తిరిగి తన గ్రామానికి వచ్చిన తర్వాత వైసీపీ వర్గాల నుంచి బెదిరింపులు ప్రారంభమయ్యాయి. అంగన్‌వాడీ టీచర్‌గా వున్న నువ్వు లోకేష్‌ పాదయాత్రకి ఎందుకు వెళ్ళావని బెదిరించారు. అధికారుల వైపు నుంచి కూడా శిరీషకు రాజకీయాల వైపు వెళ్ళొద్దని ఒత్తిళ్ళు వచ్చాయి. కాలం గిర్రున తిరిగింది.. అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. శిరీషకు తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి పిలుపు వచ్చింది. అక్కడకి వెళ్ళిన శిరీషకి నారా లోకేష్ బీఫామ్ ఇచ్చారు.. రంపచోడవరం తెలుగుదేశం అభ్యర్థివి నువ్వే అన్నారు. శిరీషకి అది కలా.. నిజమా అనేది అర్థం కాలేదు. తెలుగుదేశం పార్టీ అండతో ఎన్నికల బరిలోకి దిగిన శిరీషకి వైసీపీ వర్గాల నుంచి ఎన్నో బెదిరింపులు.. కోట్ల రూపాయలు ఇస్తాం.. ఎన్నికల బరినుంచి తప్పుకొమ్మంటూ ప్రలోభాలు... వాటినుంచి తప్పుకుంటూ, ధైర్యంగా ముందుకు అడుగు వేసిన శిరీష ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీలో మిరియాల శిరీషాదేవి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ఆమెలో కనిపించిన ధైర్యం, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి ఒక ధైర్యవంతురాలైన నాయకురాలు వచ్చారన్న అభిప్రాయాన్ని కలిగించింది.

ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత కూడా శిరీష వారానికి ఒకసారి తాను టీచర్‌గా పనిచేసిన అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తున్నారు. అక్కడ వున్న పిల్లలకు చదువు చెబుతున్నారు. తాను ఎమ్మెల్యే అయినప్పటికీ, సాధారణ మహిళనని, సాధారణంగానే జీవిస్తానని ఆమె చెబుతున్నారు. తన ప్రాంత ప్రజలకు, అంగన్‌వాడీ ఉద్యోగులకు మేలు చేయాలన్న తపనే తనను ముందుకు నడిపిస్తోందని మిర్యాల శిరీషాదేవి చెబుతున్నారు.