బీఆర్ఎస్ విపక్ష హోదాకు ఎసరు?

తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతున్నది. ఆ పార్టీ నుంచి వలసలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  ఎవరు చేసిన ఖర్మ వారనుభవింపక తప్పదన్నట్లుగా.. అధికారంలో ఉండగా బీఆర్ఎస్ అధినేత ఆపరేషన్ ఆకర్ష్ పేరిట విపక్షాలను ఏ విధంగా  చేర్చుకుందో  అదే విధంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గాలానికి చిక్కారు అని చెప్పడం కంటే ఆ పార్టీ అధినేత  కేసీఆర్ తీరుతో విసిగిపోయే ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ విపక్షాల గొంతు అసలు వినపడొద్దు అన్న రీతిలో వ్యవహరించిందనీ, అదే ఇప్పుడు రివర్స్ అవుతోందని అంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నా పట్టించుకోకుండా ఫామ్ హౌస్ కే పరిమితమై మౌనముద్ర వహించిన కేసీఆర్  తీరు నచ్చకే ఎమ్మెల్యేలు వలస బాట పట్టారని అంటున్నారు.  

మరో వైపు బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసేందుకు కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తున్నది.  ఇప్పటికే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఇటీవలి లోక్ సభ ఎన్నికలలో కనీసం ఖాతా తెరవలేదు. ఆ పార్టీ ప్రాతినిథ్యం లోక్ సభలో జీరో.  ఇంత క్లిష్టపరిస్థితుల్లో సైతం కేసీఆర్  ఫామ్ హౌజ్ దాటడంలేదంటూ ఆయనపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోగా, మరింత మంది అదే దారిలో ఉన్నారని అంటున్నారు.  

కడియం శ్రీహరితో మొదలైన  వలసలు,  తెల్లం వెంకట్రావు (భద్రాచలం), దానం నాగేందర్ (ఖైరతాబాద్), పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్సువాడ), కాలె యాదయ్య (చేవెళ్ళ), తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేరికదాకా దారితీశాయి.   పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయలో బీఆర్ఎస్  తెలుగుదేశం, కాంగ్రెస్ శాసనసభాపక్షాలను విలీనం చేసుకున్నది. ప్రస్తుతం బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నది. శాసన సభలోనే కాకుండా శాసనమండలిలో సైతం బీఆర్ఎస్ ఆధిపత్యం కొల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకే సారి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు  కాంగ్రెస్‌లో చేరిపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.  

మరో వైపు బీజేపీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు గాలం వేస్తున్నది. కమలం గూటికి చేరాలనుకునే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే రెడ్ కార్పెట్ వెల్ కమ్ చెబుతామంటూ తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ప్రకటనకు కారణం కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లోకి రావడమేనని అంటున్నారు.   మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ లోకో అటు బీజేపీలోకో  చేరిపోవడం ఖాయమని అంటున్నారు. మహా మిగిలితే బీఆర్ఎస్ లో ఓ ఐదారుగురు మిగులుతారనీ, వారితో బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాను కాపాడుకోవడం అసాధ్యమని చెబుతున్నారు.