బిఆర్ఎస్ కు మరో షాక్...  ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డికి  కాంగ్రెస్ తీర్థం

పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ సత్పలితాలను ఇస్తోంది. ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు,ఆరుగురు ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిపోయారు. 
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ... ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసగా పార్టీని వీడుతున్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ లేకుండా ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంఎల్ సిలను చేర్చుకుని ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఎన్నికల్లో బిఆర్ ఎస్ మెజార్టీ స్థానాల్లో గెలిచినప్పటికీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. ముల్లును ముల్లుతో తీయాలి అన్నట్టు రేవంత్ రెడ్డి సైతం అదే పని చేస్తున్నారు. బిఆర్ఎస్ ను కోలుకోని దెబ్బతీయాలని సంకల్పించి గత కొన్ని రోజులుగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఒకే రోజు ఆరుగురు ఎమ్మెల్సీలను  చేర్చుకుని బిఆర్ఎస్  ను దొంగ దెబ్బతీశారు.  
తాజాగా, బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరోవైపు ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే... ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది.