రేవంత్ కామెంట్స్ దేనికి సంకేతం?

ఆ వ్యాఖ్యలకు ఓ లెక్కుంది.. అదేంటంటే? 

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా అప్పులు పుట్టని అధ్వాన స్థితిలో రాష్ట్రం వుందా ? తెలంగాణ పేరు చెపితే, ఛీ’ పో అనే   స్థితిలో  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వుందా ?  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిజంగానే అంత అధ్వాన స్థితిలో ఉందనే అనుకున్నా.. ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డికి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని తెలియదా? అయినా, ముఖ్యమంత్రి అంతగా కడుపు చించుకోవడం ఎందుకు? ఇది దేనికి సంకేతం? అప్పులకోసం వెళితే బ్యాంకులు దొంగల్లా చూస్తున్నాయని, ,ఢిల్లీలో అప్పాయింట్ కూడా దొరకడం లేదని,   దొంగల్లా  చూస్తున్నారని, ఇంకా రకరకాలుగా రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా, స్వయంగా ముఖ్యమంత్రి కామెంట్స్ చేయడాన్ని ఎలా అర్థం చేఉకోవాలి ? ఆర్థిక పరిస్థితి అసలేం బాగా లేదని, అంత వివరంగా, విపులంగా వివరించ వలసిన అవసరం ఏమొచ్చింది?   ఎందుకు వివరించారు?

చివరకు, ఇక సమరమే అంటూ ప్రభుత్వం పై సమ్మె శంఖం పూరించిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులను ఏమి చేసుకుంటారో చేసుకోండి .. నన్ను కోసుకుని, వండుకు తిన్నా సరే..  ఇప్పడున్న పరిస్థితిలో ఉద్యోగుల డిమాండ్లు ఏవీ ఆమోదించడం సాధ్యం కాదని అంతలా ఎందుకు విరుచుకు పడినట్లు? ఎందుకు? పరోక్షగా ఉద్యోగ సంఘాలను సమ్మెకు ఉసిగొలిపే విధంగా వ్యాఖ్యలు చేశారు. అలా చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటి ? వ్యూహం ఏమిటి? ఇలా అనేక ప్రశ్నలు రాజకీయ చర్చల్లో వినిపిస్తున్నాయి.  
అయితే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం ఇదే తొలిసారి కాదు.  గతంలోనూ ఆయన ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇవే లెక్కలు వినిపిస్తూ వచ్చారు. రాష్ట్ర నెలసరి ఆదాయం రూ.18,500 కోట్లు, వ్యయం రూ. 22,500 కోట్లు, నెలసరి లోటు రూ. 4,000 కోట్లు అంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పలు సందర్భాలలో అనేక వేదికల నుంచి  రేవంత్ రెడ్డి వివరిస్తూనే ఉన్నారు.అలాగే.. ఆ పరిస్థితికి   గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన అప్పులే కారణమని కూడా అంతే స్పష్టంగా చెపుతూనే ఉన్నారు. 

అయితే..  గతానికి  ప్రస్తుత సందర్భానికి కొంత తేడా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే,ముఖ్యమంత్రి పర్యవసానాలను ఆలోచించకుండా అనాలోచితంగా, అవగాహన లోపంతో గుప్పిట విప్పారా, దాపరికం లేకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని  ప్రజల ముందు ఉంచారా అన్న చర్చ కూడా రాజకీయ, మీడియా వర్గాల్లో జరుగుతోంది. అదే సమయంలో  ముఖ్యమంత్రి అనాలోచితంగానో, అనుభవ రాహిత్యంతోనో గుప్పిట విప్పలేదని, లోగుట్టు బయట పెట్టలేదని అంటున్నారు.  లెక్కలు, మరీ ముఖ్యంగా రాజకీయ లెక్కలు చూసుకునే గుప్పిట విప్పారని అంటున్నారు. 
అయితే.. ముఖ్యమంత్రి వ్యాఖ్యల వెనక ఏముంది అనే విషయంలో రాజకీయ పండితులు విభిన్న కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా హామీల అమలు కోసం  సమ్మెకు సిద్దమవుతున్న ఆర్టీసీ, ప్రభుత్వ ఉద్యోగుల ప్రయత్నాలను మొగ్గలోనే తుంచేసే ఎత్తుగడలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి  నగ్న స్వరూపాన్ని ఉద్యోగుల ముందు ఉంచారనీ,  అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోరికలు తీర్చాలంటే, పెట్రోల్ మొదలు ఉప్పు పప్పు వంటి నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపు చేయడం, లేదంటే వృద్ధాప్య, వితంతు పెన్షన్లు, ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మివంటి ఇతర సంక్షేమ పధకాలకు కోత విధించడం తప్ప మరో మార్గంలేదనీ,  ఏ పథకాలను ఎత్తేయాలో మీరే చెప్పండని బంతిని చాకచక్యగా ఉద్యోగుల కోర్టులోకి నెట్టేశారని అంటున్నారు. అలాగే..  ముఖ్యమంత్రి ప్లే చేసిన  ఈ ఎత్తుగడ ఆర్టీసీ ఉద్యోగ కార్మిక  సంఘాలు సమ్మెను వాయిదా వేసుకోవడంతో కొంతవరకు సక్సెస్ అయిందని కూడా అంటున్నారు.  

అదొకటి అయితే..  అంతకంటే ముఖ్యంగా తమ కుర్చీని కాపాడుకునే ఎత్తుగడలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి మార్పు గురించి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతన్న నేపధ్యంలో  కాంగ్రెస్ అధిష్టానం ముందరి కాళ్ళకు ఆర్ధిక బంధం వేసే ఎత్తుగడలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆర్ధిక ఆస్త్రాన్ని సంధించి ఉండవచ్చని అంటున్నారు. 

ఓ వంక కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేని  రోల్ మోడల్ గా  చూపించి దేశ వ్యాప్తంగా రాజకీయ లబ్ది పొందేందుకు చూస్తున్న సమయంలో.. అదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక  అధ్వాన పరిస్థితిని  దేశం ముందు ఉంచడం ద్వారా బీజేపీకి ఒక బలమైన అస్త్రాన్ని అందిచారని అంటున్నారు. నిజానికి  కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా, బీజేపే నాయకులు ఇప్పటికే, తమ అస్త్రాలను ఆరు గ్యారెంటీలకు హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా పైకి సంధించారు.  అలాగే.. రాష్ట్రంలో రజతోత్సవ వేడిలో జనంలోకి వెళుతున్న బీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా అస్త్రాన్ని అందించారని అంటున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్,మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి లెక్కలు తప్పని చెప్పడమే కాకుండా..  కాంగ్రెస్ పార్టీని అనేక కోణాల్లో కార్నర్ చేశారు. ముఖ్యంగా, కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రతిష్టను కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చి వేస్తోందంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని తెర మీదకు తెచ్చారు.

అలాగే..  ఆరు గ్యారెంటీలు,420 హామీలకు శాశ్వత సమాధి కట్టే ఉద్దేశంతో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచారని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఉచితాలే సర్వ అనర్ధాలకు మూలం  ఆని తీర్మానించారు. ఉచితాలపై పునరాలోచన చేయవలసిన సమయం ఆసన్నమైందని  అన్నారు. అంటే , ఉచితాలకు కాలం చెల్లిందని మంత్రి తుమ్మల చెప్పకనే చెప్పారని అంటున్నారు.

ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్క చూసుకునే చిట్టా విప్పారని అంటున్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అనాలోచితం అనుకున్నా  దానికో లెక్కుందని అంటున్నారు.     నిజం ఏమిటి అన్నది నిలకడ మీద గానీ  తెలియదనీ అయితే  ముఖ్యమంత్రి కామెంట్స్   కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే గట్టిగా దెబ్బ కొట్టాయనీ, అందుకే ఢిల్లీలో ఉన్న రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,ముఖ్యమంత్రి కామెంట్స్ పై సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారని అంటున్నారు.  సో ... ముఖ్యమంత్రి మనసులో ఏముంది? రేపటి పరిణామాలు ఏమిటి, అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ ..అయినా, ఆయన వ్యాఖ్యలకు ఓ లెక్కయితే వుందని విశ్లేషకులు అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu