ఏబీ వెంకటేశ్వరరావుపై ఏసీబీ కేసును క్వాష్ చేసిన హైకోర్టు
posted on May 7, 2025 1:02PM
.webp)
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన ఏసీబీ కేసును హైకోర్టు క్వాష్ చేసింది. ఏబీవెంటటేశ్వరరావు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గతంలోనే తీర్పు రిజర్వ్ చేసింది. ఆ సపంద్భంగా.. తుది తీర్పు వెలువడే వరకూ విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణపై కూడా స్టే విధించింది.
ఇంతకీ ఏబీ వెంకటేశ్వరరావుపై అప్పట్లో నమోదైన కేసేంటంటే.. భద్రతా పరికరాల కొనుగోలు టెండర్ వ్యవహారంలో ఏబీవీ అవకతవకలకు పాల్పడ్డారని. అప్పటి జగన్ సర్కార్ ఆ ఆరోపణలతోనే ఏబీవీని విధుల నుంచి సస్పెండ్ చేసింది. తన సస్పెన్షన్ పై ఏబీవీ అలుపెరుగని న్యాయపోరాటం చేశారు.
తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ వెళ్లారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులతో అప్పటి జగన్ సర్కార్ కు ఏబీవీ సస్పెన్షన్ ను ఎత్తివేయడం వినా మరో గ్యతంతరం లేకపోయింది. అయితే ఆయనను సర్వీసులోకి తీసుకున్నట్లే తీసుకుని ఆ మరుసటి రోజే మళ్లీ జగన్ సర్కార్ ఆయనను అవే అభి యోగాలతో సస్పెండ్ చేసింది. దీంతో ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించారు. ఆయన సస్పెన్షన్ ఉత్తర్వులను క్యాట్ రద్దు చేయడంతో నాటి ప్రభుత్వం ఆయన పదవీ విరమణకు ఒక్క రోజు ముందు పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆయన మరలా ప్రింటింగ్ అండ్ స్పేషనరీ విభాగం అడిషనల్ డీజీగా బాధ్యతలు చేపట్టి అదే రోజు పదవీ విరమణ చేశారు.
అదలా ఉంటే తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ ఏబీవీ 2022లో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ ను విచారించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసి.. విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణపై స్టే విధించింది. ఇప్పుడు ఆయనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేస్తూ తుది తీర్పు వెలువరించింది.