భారత్‌ అమ్ములపొదిలో అత్యాధునిక ఆయుధాలు

పాక్‌లోని ఉగ్రవాదులకు కాళరాత్రి అంటే ఏమిటో భారత్‌ చూపించింది. త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ కోసం భారత్‌ అమ్ముల పొదిలో నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసింది. ఆత్మాహుతి డ్రోన్లు.. స్కాల్ప్‌ క్షిపణులు.. హ్యామర్‌ బాంబులను వాడినట్లు ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది. వాస్తవానికి మిలిటరీ ఆపరేషన్లకు ఏ రకం ఆయుధాలు వాడారన్నది దళాలు ఎన్నడూ బహిర్గతం చేయవు. కానీ..  అవి లక్ష్యాలను ఛేదించిన తీరు ఆధారంగా అంచనాలకు వస్తుంటారు. తాజాగా ఆపరేషన్‌ సిందూర్‌లో తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు వేర్వేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు.    

ఈ దాడులకు దళాలు ఆత్మాహుతి డ్రోన్లను వినియోగించినట్లు తెలుస్తోంది. వీటిని లాయిటరింగ్‌ మ్యూనిషన్‌ అని వ్యవహరిస్తారు. ఇవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకొని.. లక్ష్యాలను గుర్తించి.. వాటిపై విరుచుకుపడతాయి. వీటిల్లో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి.  భారత్‌ అమ్ముల పొదిలో ఈ రకం డ్రోన్లు చాలా ఉన్నాయి. వీటి వినియోగంతో మన దళాల వైపు ప్రాణనష్టం ప్రమాదాన్ని నివారించవచ్చు. దీంతోపాటు కదలుతున్న లక్ష్యాలను కచ్చితంగా ఛేదించేందుకు వాడతారు.  

స్కాల్ప్‌ క్షిపణులను స్ట్రామ్‌షాడో అని కూడా అంటారు. వీటిని ఫ్రాన్స్‌ అభివృద్ధి చేసింది. ఇది దీర్ఘశ్రేణి క్రూజ్‌ మిసైల్‌. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది. శత్రుదేశాల్లోకి చొచ్చుకెళ్లి దాడి చేసేందుకు వీటిని వినియోగిస్తారు. దీనిని యుద్ధ విమానాలపై నుంచి ప్రయోగించే అవకాశం ఉంది. భారత్‌ తాజాగా దాడిలో ఫ్రాన్స్ తయారీ రఫేల్స్‌ నుంచి దీనిని ప్రయోగించి ఉండొచ్చని భావిస్తున్నారు. 

బలంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు హ్యామర్‌ బాంబులను వినియోగిస్తారు. ఇది స్మార్ట్‌బాంబ్‌ కోవలోకి వస్తుంది. వీటిని లక్ష్యానికి 50-70 కిలోమీటర్ల దూరం నుంచే ప్రయోగించవచ్చు. ఎంత ఎత్తు నుంచి దీనిని ప్రయోగిస్తున్నారన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. 

భారత్‌ దాడి చేసిన లక్ష్యాల్లో జేషేకు అత్యంత కీలకమైన బహవల్‌పూర్‌లోని మర్కజ్‌ సుబాన్‌ ఉంది. ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహ్మద్‌కు చెందిన ప్రధాన కార్యాలయంగా పేర్కొంటారు. ఇక లష్కరే హెడ్‌క్వార్టర్‌ అయిన మర్కాజ్‌ తోయిబా కూడా ఉంది. సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఇది. ఇక్కడే 26/11 ముంబయి దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం.

పాక్‌లో ధ్వసం చేయాల్సిన ఉగ్ర స్థావరాలపై దాడులను ఎయిర్‌ఫోర్స్‌, ఆర్మీ, నేవీ సమన్వయం చేసుకొన్నాయి. అతిపెద్ద ఉగ్ర స్థావరాలైన బవహల్పూర్‌.. మురిద్కేలను ధ్వంసం చేసే బాధ్యత వాయుసేన స్వీకరించినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన వాటి సంగతి ఆర్మీ తీసుకొంది. నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన పీ8ఐ విమానాలు, ఎంక్యూ9 డ్రోన్లతో సహకారం అందించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu