విడాకులు వెక్కిరిస్తాయ్ జాగ్రత్త!!

మామిడాకుల తోరణాల మధ్య, మంగళ వాయిద్యాల మురిపెంలో, మూడుముళ్ళతో ఒక్కటై, జీవితాంతం ఒకరికి ఒకరని ఉండాల్సిన దంపతులు కాస్తా  విడాకులను పంచేసుకుంటున్నారు.  ఈమధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువైపోతొంది. విడాకులకు చెబుతున్న కారణాలకు కోర్ట్ లోని జడ్జ్ లు కూడా విస్తు పోతూ ఉంటారు. ఎందుకంటే చాలా చిన్న సమస్యలను కారణంగా చూపుతూ విడాకులు కావాలని అడగుతున్నందుకు. 

ప్రతి మనిషి ప్రతి సమస్యను స్వయానా అనుభవిస్తున్నపుడే ఆ సమస్యలో తీవ్రత అర్థమవుతుంది. అందుకే సమస్యలు చిన్నవి అయినా  అవి వాళ్ళను ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. బయటి వాళ్ళు మాత్రం చాలా తొందరగా విమర్శలు  చేసేస్తారు. అయితే సమస్యలు ఎలాంటివి అయినా మనుషులు బంధాలను అంత సున్నితంగా వదిలేయడం, విడిపోవడం అనేవి కాస్త కలవరపరిచే విషయాలే. 

అసలు విడాకులు ఎందుకు??

ఒకరితో మరొకరు కలిసి బతకలేం అనే విషయం పూర్తిగా అర్థమైనపుడు అలా విడిపోవడం అనే సందర్భం వస్తుంది. చాలామంది పరువు కారణంగానో, పిల్లల భవిష్యత్తు కారణంగానో, మరీ వేరే ఇతర కారణాల వలనో ఇష్టం లేకపోయినా బతుకు వెళ్లదీస్తుంటారు. 

విడాకుల వల్ల నష్టపోయేది అమ్మాయిలే అనే ముఖ్య విషయం చాలా చోట్ల అర్థమవుతూ ఉంటుంది. కారణాలు చాలానే ఉన్నాయి. పిల్లలు అమ్మాయిల దగ్గరే ఉండటం, ఆర్థికంగా మరియు ఉద్యోగ విషయంగా మంచి స్థాయిలో లేకపోవడం. 

విడాకుల తర్వాత సమాజం దృష్టిలో చులకన అయిపోతామనే భావం గట్టిగా బలపడి ఉండటం.

అటు తల్లిదండ్రుల వైపు నుండి, ఇటు అత్తమామలు వైపు నుండి ఎలాంటి ఆదరణ లేకపోవడం. 

మరి అమ్మాయిలు స్ట్రాంగ్ అవ్వడం ఎలా??

చాలావరకు విడాకుల విషయంలో నెలనెలా భార్యకు భరణం ఇస్తున్న భర్తలు చాలా తక్కువని చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో మొదట్లోనే కొద్దీ మొత్తం ఇచ్చి పూర్తిగా వదిలించేసుకుంటారు. అలాంటి విషయాలపై ఆధారపడకుండా….

మహిళలు చదువు లేకపోయినా కొన్ని నైపుణ్యాలు నేర్చుకుని ఉండాలి.  కుట్టు పని, అల్లికలు, ఆర్ట్&క్రాఫ్ట్స్, ఇతర చేతి పనులు వంటివి నేర్చుకుని ఉండాలి.

విడాకుల విషయంలో అనవసర ఇగో లకు పోకుండా ఉండాలి.

భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని చర్చించుకోవడం అనేది ఎంతో ముఖ్యం. ఒకవేళ ఆ చర్చలో కలిసి ఉండలేం అనే విషయం ఫైనల్ అయినా ఆరోగ్యంగా విడిపోవాలి. ఎవరూ ఎవరిని అనవసర విమర్శలు చేసుకోకూడదు.

విడాకుల వల్ల తదుపరి తమ జీవితాలు బాగుంటాయా లేదా అనే విషయం ఆలోచించాలి. లేకపోతే పెనం మీద నుండి పొయ్యిలోకి పడ్డ చందాన తయారవుతాయి జీవితాలు.

అమ్మ నాన్నలో, అక్కా తమ్ముల్లో, అన్నా వదినలో లేక స్నేహితులో ఇరుగు పొరుగు వాల్లో ఇలా ఎవరిని జోక్యం చేసుకొనివ్వకూడదు. ఎందుకంటే ముడిపడిన జీవితాలు రెండైనపుడు, ఒకరికొకరు అర్థం చేసుకోవాల్సింది మొదట ఇద్దరే. 

ఆర్థిక విషయాల పట్ల ఎలాంటి మోహమాటాలు లేకుండా మాట్లాడుకోవడం ఉత్తమం. ఎందుకంటే జీవించాలంటే డబ్బు కూడా అవసరమే.

ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే విడాకుల ప్రభావం పిల్లల మీద పడకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడే వ్యక్తి గతంగా ఉత్తమంగా ఉండగలరు. పిల్లల భవిష్యత్తు గందరగోళానికి గురవ్వకుండా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల దగ్గర విడిపోయిన భాగస్వామి గురించి చెడుగా మాట్లాడకూడదు. 

మంచి ముహుర్తాలు పెట్టుకుని జతకావడం, విడాకుల ద్వారా విడిపోవడం అనేది జీవితాల్లో కచ్చితంగా అలజడి సృష్టిస్తుంది. అయితే ఆలోచించి అడుగు వేయడం ముఖ్యం. ఎందుకంటే  మీరు వేసేది  తప్పటడుగై ఏడడుగులను వెక్కిరించకూడదు మరి.

◆ వెంకటేష్ పువ్వాడ