అదృష్టం కావాలా నాయనా??

సాధారణంగా చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎక్కువగా వినే మాట. అదృష్టం లేదురా!! దేనికైనా రాసిపెట్టి ఉండాలి అని. 

ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసినపుడు చివరలో అది తమకు కాకుండా పోయినప్పుడు, ఏవైనా ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి అనే ఆశతో ఉన్నపుడు అది లాభాన్ని ఇవ్వనపుడు ఇట్లాంటి పెద్ద విషయాల నుండి, నచ్చిన కలర్ డ్రెస్ దొరకనపుడు, తినాలని అనుకున్నది తినలేకపోయినపుడు, విచిత్రంగా పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చి ర్యాంక్ వెనుకబడ్డపుడు ఇవి మాత్రమే కాకుండా ఈ లిస్ట్ చాంతాడంత ఉంటుంది. ఇవన్నీ గమనిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే. అదృష్టం అంటే లాభం చేకూర్చేది అని. 

కానీ మనుషులు ఎందుకు ఇలా అనుకుంటున్నారు??

ఒక వ్యక్తి ప్రమోషన్ వస్తుందని ఆశ పడతాడు. అతను మంచి ఉద్యోగస్తుడే కావచ్చు, చాలా ఎక్స్పీరియన్స్ ఉండి ఉండచ్చు, కానీ అతనికి ప్రమోషన్ రాకపోతే అదృష్టం లేదనుకునేస్తారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, అతనికంటే మంచి ఉద్యోగస్తుడు, ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి దానికి ఎంపిక చేయబడ్డాడు ఏమో!! ఇలా ప్రతి చోట కూడా మనకు ఏదైనా దక్కకపోతే మన ఆలస్యమో, లేక మనకంటే మెరుగ్గా ఉన్నవారు అవకాశాన్ని అందుకుని ఉండచ్చని అనుకోవచ్చు  కదా!! కానీ ఎవ్వరూ ఇలాంటివి ఆలోచన చేయరు.

 [[ అదృష్టం అంటే ఏమిటి?? ]]

చాలా మందికి అదృష్టం అంటే కష్టపడకుండా, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉన్నప్పుడు తమదగ్గరకు వెతుక్కుంటూ వచ్చే ఒకానొక తాత్కాలిక సంతోషం. వందమంది పేర్లు కొన్ని చిన్న కాగితాలలో రాసి ఒక గాజు సీసాలో వేసి వాటిలో ఒక్కటి బయటకు తీస్తే అందులో ఉండే పేరును అదృష్టం అంటారు. దాని మీద ఆశ అనేది ఉండకూడదు. ఎందుకంటే మందలో మెరుపు ఎక్కడో ఎవరికి తెలుసు. కానీ అందరూ ఏమి చేస్తారు తమ పనులు వదులుకుని మరీ ఆ వచ్చే కాగితంలో తమ పేరు ఉంటుందని మానసికంగా ఫిక్స్ అయిపోయి ధీమాగా ఉంటారు. తమ పేరు రాకపోయేసరికి అదృష్టం లేదు అనుకుంటారు. చాలా ఫ్యూలిష్ గా అనిపించడం లేదూ ఈ ప్రవర్తన. మనకు దక్కకుండా మరొకరికి దక్కితే మనది అదృష్టం కాదు, మరి అవతలి వారిది అదృష్టమేనా?? లేక వారి కష్టపలమా. ప్రతి మనిషి ప్రతివిషయంలో తన పూర్తి శక్తి సామర్త్యాలు ఉపయోగించే అడుగేస్తే ఫలితం ఎట్లా ఉంటుంది?? ప్రతి మనిషి చేయబోయే పని గురించి పూర్తిగా తెలుసుకుని, బాగా ఆలోచించి ప్రణాళిక వేసుకుంటే ఫలితం ఎలా ఉంటుంది. అన్ని జీవులలోకి ఎంతో ఆలోచనా పరులు అయిన మనుషులే ఈ విషయాన్ని విస్మరించి చెట్టు కొమ్మ చివరి అంచున వాలిన పక్షి లాంటి అదృష్టం కోసం చెట్టెక్కితే ఎలా?? కదలికకు ఆ పక్షి ఎగిరిపోయినట్టే, తగినంత కష్టం లేక మన ఫలితం కూడా దూరమైపోదా??

అదృష్టం ఎక్కడుంది??

నిజానికి మనిషి రోజులో కనీసం ఒక్కసారి అయినా అదృష్టం గురించి అనుకుంటారు.  నిజానికి ఇలా అదృష్టం గూర్చి అనుకునేవాళ్లకు స్వశక్తి మీద తమ సామర్థ్యం మీద నమ్మకం లేని వాళ్లేమో అనిపిస్తుంది. 

కొందరు పేరులో అదృష్టం అంటారు
కొందరు సంఖ్యలలో అదృష్టం అంటారు
కొందరు జాతకంలో అదృష్టం అంటారు
కొందరు రంగులో అదృష్టం అంటారు
కొందరు దిక్కులో అదృష్టం అంటారు.

వీటన్నిటి కోసం ఎంతో ధనం వృథా చేస్తారు  కానీ కష్టే ఫలి అన్న పెద్దల మాటలు తెలిసిన తెలియనట్టే చేస్తారు.

వెర్రి వేయి విధాలు అన్నట్టు వస్తుందో రాదో, మనది అవుతుందో లేదో అనే మీమాంసలో ఉన్న విషయం పట్ల ఎందుకింత ఆసక్తి మనుషులకు.

నిజమైన అదృష్టం 

నిజనికి మనిషి ధీమాగా బతకడానికి కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు ఇలా శరీర అవయవాలు అన్ని సక్రమంగా ఉండి ఉంటే చాలదూ.  కష్టపడాలి, సంపాదించుకోవాలి, బుద్ధి ఉపయోగించాలి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలి.  మనిషి పూర్తి ఆరోగ్యస్తుడిగా ఉండటమే గొప్ప అదృష్టమని, అదే నిజమైన అదృష్టమని తెలుసుకుంటే మనిషి జీవితం కొత్త మలుపు తిరగడం ఖాయం మరి.

◆ వెంకటేష్ పువ్వాడ