ఎంతో సంతోషంగా ఉన్న భార్యాభర్తల బంధాన్ని కూడా నాశనం చేసే విషయాలు ఇవి..!


భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు.  అలాగని వీటికి పెద్ద కారణాలు ఉన్నాయా అంటే అది కూడా లేదు.  పెద్ద కారణాలు, గొడవలు జరిగినప్పుడే విడిపోవడానికి దారి తీస్తుందని అనుకుంటే పొరపాటే.. పైకి కనిపించకుండానే భార్యాభర్తల బంధం పెళుసుబారుతుంది. ఎంతో సంతోషంగా ఉన్న జంట కూడా కొన్ని తప్పులు చేయడం వల్ల తమ బంధాన్ని నాశనం చేసుకుంటారు.  ఇంతకీ భార్యాభర్తల బంధాన్ని  నాశనం చేసే తప్పులు  ఏంటో తెలుసుకుంటే..

అనుమానం..

ఏ సంబంధానికైనా అనుమానం అతిపెద్ద శత్రువు.  లైఫ్ పార్ట్నర్  ఫోన్‌ను చెక్ చేయడం, పదే పదే అనుమానించినట్టు చూడటం చేస్తుంటే, వారిపై నిఘా పెడుతుంటే లేదా అనవసరమైన ప్రశ్నలు అడుగుతుంటే జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం లేకుండా ప్రేమ అనే భవనం నిలబడదు. అనుమానం పెనుభూతం అనే మాట వినే ఉంటారు.  అనుమానం  అనేది ఒక సంబంధాన్ని లోపల నుండి క్షీణింపజేసే చెదపురుగుల లాంటిది.

ఎగతాళి..

ఎగతాళి చేయడం చాలామందికి అదొక కామెడీ ఆటగా ఉంటుంది. కోపంతో లేదా హాస్యంగా ఎగతాళి చేయడం సర్వసాధారణంగా అనిపించవచ్చు, కానీ అది అవతలి వ్యక్తి హృదయంలో లోతైన గాయాన్ని కలిగిస్తుంది. "నీకు ఏమీ తెలియదు" లేదా "నువ్వు ఎప్పుడూ అలాగే చేస్తావు" వంటి మాటలు   భాగస్వామి మనస్సులో నెమ్మదిగా  ద్వేషాన్ని పెంచుతాయి. అంతేకాదు.. బాడీషేమింగ్ గురించి,  రూపం గురించి చేసే ఎగతాళి మరింత మానసిక గాయం చేస్తుంది. ఇవి చాలా తప్పు.

పోలిక..

భార్యాభర్తలు ఎప్పుడూ తమ భాగస్వాములను ఇతరులతో పోల్చి దెప్పిపొడచకూడదు.  ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఎవరికి వారు ప్రత్యేకం.  ఇతరులతో ఏ విషయంలో పోలిక పెట్టి మాట్లాడటం చాలా తప్పు. ఇతరులతో పోల్చి మాట్లాడేటప్పుడు తమతో బంధం ఎందుకు అని భావించేవారు ఉంటారు. ఇది వ్యక్తి ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తుంది.

పంతం..

నేను చెప్పిందే నిజం, నేను చెప్పిందే పైనల్.. లాంటి మాటలు మాట్లాడుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. తాను కరెక్ట్ అని తన భాగస్వామి తప్పని నిరూపించడానికి ట్రై చేస్తుంటారు. వారి అహం వారిని అలా చేయిస్తుంది. కానీ ఇది బందం నాశనం కావడానికి కారణం అవుతుంది.

మౌనం..

భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు మౌనంగా ఉండటం మంచిదే. కానీ భార్యాభర్తల మధ్య గౌడవ కేవలం మౌనంతో పరిష్కారం కాదు. కొందరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి మౌనాన్ని ఆయుధంగా వాడతారు.  అలా చేయడం వల్ల అపార్టాలు మరింత పెరుగుతాయి.

పాత విషయాలు..

భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు చాలామంది చేసే పని పాత విషయాలు బయటకు తీసి వాటి గురించి మాట్లాడతారు.  ఇలా జరిగిపోయిన విషయాలను బయటకు తీసి మాట్లాడుతుంటే గొడవ వల్ల బందంలో ఏర్పడిన గాయం ఎప్పటికీ మానదు.  ఎప్పటి గొడవలు అప్పుడే వదిలేయాలి.

మొబైల్..

నేటి కాలంలో బంధాలలో దూరం పెరగడానికి మొబైల్ ఫోన్ లే కారణం. భార్యాభర్తలు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నా, ఇద్దరూ కలిసి పక్కన పక్కన కూర్చొన్నా  ఫోన్ లో  నిమగ్నమవుతుంటారు.  దీని వల్ల ఒకరిని ఒకరు పట్టించుకోలేని పరిస్థితికి వస్తారు. ఒకరి ప్రదాన్యత ఇలా తగ్గిపోతుంది. ఇది విడిపోవడానికి కారణం అవుతుంది.

స్పేస్..

భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువైనా కష్టమే.  ప్రేమ పేరుతో అతుక్కుపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం.  24గంటలు అతుక్కుని ఉండటం,  భాగస్వామి మీద ఆంక్షలు విధించడం, స్నేహితులను, బంధువులను కలవనివ్వకపోవడం వంటివి చేస్తే అలాంటి బంధాన్ని ఎప్పుడెప్పుడు వదులుకుందామా అనుకుంటారు. ఇలాంటి బందం ఒక పక్షిని గట్టిగా చేతిలో బంధించినట్టే ఉంటుంది.


సంతోషకరమైన సంబంధాన్ని బిల్డ్ చేసుకోవడం  రాకెట్ సైన్స్ కాదు. ఒకరినొకరు గౌరవించుకోవాలి, నమ్మకంగా ఉండాలి,  క్షమించడం నేర్చుకోవాలి.. పైన పేర్కొన్న  ఈ ఎనిమిది విషయాలను దృష్టిలో ఉంచుకుంటే బంధాన్ని నిలబెట్టుకోవచ్చు.

                              *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu