నార్సిసిస్టులు.. వీళ్లను గుర్తించడానికి ఇవే సరైన మార్గాలు..!
posted on Dec 30, 2025 2:18PM

ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వారి వ్యక్తిత్వానికి తగినట్టు వారు మాట్లాడుతుంటారు. నచ్చినట్టే ఏ పని అయినా చేస్తుంటారు. అయితే సైకాలజీ ప్రకారం మనుషులను వివిధ వర్గాలుగా విభజిస్తారు. వారిలో నార్సిసిస్టులు కూడా ముఖ్యమైనవారు. నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు. దీని వల్ల వారు గొప్ప వారు అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. నార్సిసిస్టులు తమ తప్పు ఎప్పటికీ ఒప్పుకోరు. తమ తప్పును ఒప్పుకోకూడదు కాబట్టి, తాము చేసింది కరెక్ట్ అని నిరూపించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం ఎవ్వరినైనా దోషులుగా నిలబెట్టడానికి వెనుకాడరు. ఈ నార్సిసిస్టులు మన చుట్టూనే ఉంటారు. కానీ వీరిని అంత సులువుగా గుర్తించలేం. మనం నార్సిసిస్టులతో మాట్లాడుతున్నాం అని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
తప్పుల తిరస్కారం..
నార్సిసిస్టులు తమ తప్పులను ఎప్పుడూ ఒప్పుకోరు. వారిని ఏదైనా విషయంలో గట్టిగా అరిచినట్లయితే, వారు వెంటనే ఎందుకంత రియాక్ట్ అవుతున్నావ్ ఇదేమంత పెద్ద విషయమని అంటారు, లేదంటే నేను అలా ప్రవర్తించలేదు, నాకు అలాంటి హ్యాబిట్ లేదు అని అంటారు. తమ తప్పులు బయట పడకుండా ఉండటం కోసం ఎదుటివారిని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు. నిజంగా జరిగిన సంఘటనలను కూడా తిరస్కరిస్తారు. టోటల్ గా గందరగోళానికి గురిచేసి ఎదుటి వ్యక్తి తమ మీద తాము అనుమానించుకునే స్థాయికి తెస్తారు.
ఎదుటి వ్యక్తిని కించపరచడం..
నార్సిసిస్టులు వారి తప్పులు లేదా వారి నిజాలు బయటపడినప్పుడు తమ తప్పు దాచుకోవడానికి అవతలి వ్యక్తిపై దాడి చేస్తారు. తెలివి లేని వ్యక్తులు గానూ, డ్రామా ఆడే వారిగానూ ఎదుటి వ్యక్తులను నిందిస్తారు. వారి వ్యక్తిత్వాన్నే కించపరిచి, వారిని తక్కువ చేసి మాట్లాడతారు. సింపుల్ గా ఎదుటివారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం ద్వారా తమను తాము రక్షించుకోవడానికి ట్రై చేస్తారు. కేవలం ఇది మాత్రమే కాదు.. గతంలో జరిగిన తప్పులను ప్రస్తావిస్తూ అన్నింటిని కలిపి ఎదుటి వారిని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు.
తామే బాధితులుగా..
నార్సిసిస్టులు తరచుగా తమను తాము బాధితులుగా చిత్రీకరించుకుని వారు చేసిన తప్పుల నుండి అందరినీ దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తారు. వారిని తప్పుగా అర్థం చేసుకున్నారని లేదా వారి గురించి ఎదుటి వారే చెడుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తారు. దీని వల్ల వారి తప్పుల గురించి మాట్లాడటం మాని తాము తప్పు వ్యక్తులం కాదని నిరూపించుకోవడానికే ఎదుటి వ్యక్తులు ట్రై చేస్తారు. దీని వల్ల నార్సిసిస్టులు ఎదుటివారిని తప్పు చేసిన వ్యక్తులుగా నిలబెట్టి తాము తప్పించుకుంటారు.
తక్కువ చేసి మాట్లాడటం..
ఎదుటి వ్యక్తులు విచారం లేదా కోపాన్ని నార్సిసిస్టుల ముందు వ్యక్తం చేస్తే వారు దాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడతారు. చాలా ఓవర్ చేస్తున్నావ్ అనడం లేదా చాలా సెన్సిటివ్ అని చెప్పడం, ఇంత చిన్న విషయానికి గొడవ చేయడం ఏంటి అని అనడం చేస్తారు. చివరికి తాము నిజంగా దైర్యం లేని వారిమేమో అని ఆలోచించే స్థాయికి వారు తీసుకొస్తారు. చివరికి తప్పు నాదేనేమో అని ఎదుటివారు అనుకునేలా చేస్తారు.
తప్పులు వారివి.. నిందలు ఎదుటివారికి..
నార్సిసిస్టులు తమ తప్పులకు ఎదుటివారిని బాధ్యులుగా చేస్తారు. తాము సొంతంగా చేసే తప్పులు, పనులకు ఎదుటివారిని నిందిస్తారు. వారు అబద్ధం చెప్పి ఎదుటివారిని అబద్ధాలకోరు అని అంటారు. వారు మోసం చేస్తూ ఎదుటి వారిని అనుమానిస్తారు.
ఎదుటి వారి బాధలు.. నార్సిసిస్టులకు జోకులు..
కొన్నిసార్లు ఎదుటివారికి బాధ కలిగించే విషయాలను జోక్ లాగా మాట్లాడుతుంటారు. వారు మాట్లాడిన మాటలను ఎవరైనా ఖండిస్తే.. నేను జోక్ చేశాను దానికి కూడా ఇంత సీరియస్ అవ్వాలా అని తప్పించుకుంటారు.
పైన చెప్పుకున్న లక్షణాలన్నీ నార్సిసిస్టులలో ఉంటాయి. నార్సిసిస్ట్‌తో వాదించడానికి ప్రయ త్నించడం తరచుగా వ్యర్థం. ఎందుకంటే వారు ఏమి చేసినా తమను తాము సరైనవారని నిరూపించుకుంటారు. కాబట్టి అలాంటి వారితో బోర్డర్ లైన్ పెట్టుకోవాలి. వారితో ఎక్కువ డిస్కస్ చేయకూడదు. వారిలో ఏ విషయాలలో విబేదించకూడదు. ఏదైనా ఇబ్బంది లేదా సమస్య అనిపిస్తే మెల్లిగా తప్పించుకుని వారికి దూరం వెళ్లాలి. అంతేకానీ వారితో గెలవాలని అనుకుంటే మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.