తెలివైన వాళ్లమని మిడిసిపడుతున్నారా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు వెంటే షాకవుతారు..!

తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం వచ్చిన ప్రతి సారి తమ తెలివితేటలు, సామర్థ్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు.. ఎవరైతే తెలివి లేని వెధవ అని అన్నారో.. వారికి తమ విజయం తెలిసేవరకు మనసు ప్రశాంతంగా మారదు.  తాము తెలివైన వాళ్ళం అని నిరూపించేంత వరకు వారి అహం కూడా అస్సలు తగ్గదు. అయితే ఇదంతా కూడా చాలా పిచ్చి చేష్ట అని  అంటున్నాడు ఆచార్య చాణక్యుడు.

ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్తగా, రాజనీతి శాస్త్రజ్ఞునిగా,  ఆర్థిక నియమాలు అద్బుతంగా వెల్లడించిన వ్యక్తిగా అందరికీ పరిచయమే.  ఆయన రెండువేల సంవత్సరాల కిందట చెప్పిన విషయాలు నేటికీ  ఆచరణీయంగా, అనుసరణీయంగా ఉన్నాయి. దీన్ని బట్టి ఆయన మనుషులను,  సమాజాన్ని, పరిస్థితులను, రాజకీయాన్ని ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేశారో అర్థం చేసుకోవచ్చు. అంతటి గొప్ప వ్యక్తి తెలివైన వారికి ఒక నమ్మలేని  వాస్తవాన్ని చెప్పారు. ఈ విషయం చదివితే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. అదేంటో తెలుసుకుంటే..

చాణక్యుడు చెప్పిన నమ్మలేని రహస్యం..

చాణక్యుడు ప్రజలను తెలివైన వారిగా ఉండమని చెబుతాడు. అయితే బయటకు మాత్రం మూర్ఖులుగా నటించమని చెబుతాడు. అంతేకాదు.. అవసరమైనప్పుడు స్వార్థంగా కూడా ఉండాలని చెబుతాడు. ఈ విషయంగానే ఇదొక తప్పు మార్గం అని అందరూ అనుకుంటారు. కానీ ఆయన చెప్పిన విషయాలకు తగిన వివరణ కూడా ఇచ్చాడు.

ప్రతి వ్యక్తి తాను చేసే పనిని, తన ప్రణాళికను గొప్పగా అందరికీ తెలిసేలా చెప్పడం తెలివైన పని కాదని చాణక్యుడు అంటాడు.  ప్రస్తుత  ప్రపంచంలో ప్రజలు,  చుట్టుపక్కల ఉండేవారు, సన్నిహితులు,  ఆత్మీయులు అందరూ  స్నేహపూర్వకంగా కనిపిస్తుంటారు.  కానీ వారి ఉద్దేశాలు ఎల్లప్పుడూ స్వచ్ఛమైనవిగా ఉండవని చాణక్యుడు చెబుతాడు.  అందరినీ గుడ్డిగా నమ్మితే ఏదో ఒకరోజు అవతలి వారు బలహీనతనలు క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది.   అందుకే నిజంగా తెలివైన వ్యక్తి ఎప్పుడూ తన తెలివితేటలను అవసరం లేకుండా బయటపెట్టడు.  అందరికీ ప్రదర్శన ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తన తెలివిని బయటపెట్టడు.

మూర్ఖుడిలా నటించాలి ఎందుకుంటే..

ఒక వ్యక్తి తనను తాను తెలివైన వాడిని అని నిరూపించుకోవడానికి ట్రై చేస్తుంటే అలాంటి వ్యక్తి నుండి అందరూ క్రమంగా దూరం అవుతారని చాణక్యుడు అంటున్నాడు. లేకపోతే ఇతరుల వల్ల హాని కలగడం లేదా ఇతరుల కుట్రలకు బలి కావడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే తెలివైన వాడిని అని అందరికీ తెలిసేలా చేయడం కంటే మూర్ఖుడిగా నటించడం ఉత్తమం. దీని వల్ల ఇతరుల ప్రణాళిక, వారి ఉద్దేశ్యాలు గుర్తించడం సులువు అవుతుంది. అంతేకాదు.. ఎవరి ముందు అయినా సరే.. తక్కువగా మాట్లాడి, ఎదుటివారికి ఎక్కువ మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఇలా చేసినప్పుడు ఎదుటివారి ఉద్దేశ్యాలు చాలా బాగా అర్థం చేసుకోవచ్చు.

 స్వార్థంగా ఎందుకు ఉండాలి? ఎప్పుడు ఉండాలి?

మనుషులు స్వార్థపూరితంగా ఉండాలని చాణక్యుడు ఎప్పుడూ సమర్థించడు. పరిస్థితులు  మారిపోయినప్పుడు, ఒక వ్యక్తిని ఇతరులు స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నప్పుడు,  స్వంత ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలని చాణక్యుడు చెబుతాడు.  మొదట తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, తమ పనులను తాము సమర్థవంతంగా చేసుకుంటూ తమకంటూ ఒక గౌరవ స్థానం ఏర్పరుచుకున్నప్పుడు ప్రపంచం కూడా గుర్తిస్తుంది, గౌరవిస్తుంది.  ఎప్పుడూ  ఇతరుల కోసం మాత్రమే బ్రతికేవారిని ప్రజలు  దోపిడీ చేస్తారు. స్వార్థపూరితంగా ఉండటం అంటే ఇతరులకు హాని చేయడం కాదు, ప్రతి వ్యక్తి తన  హక్కులను కాపాడుకోవడం.

తెలివి, చాకచక్యం..

తెలివిగా ఉండటం,  చాకచక్యంగా ఉండటం రెండూ ఒకటే అనుకుంటారు చాలామంది. కానీ ఈ రెండింటి  మధ్య చాలా తేడా ఉంది. తెలివి అంటే పరిస్థితులను తెలివిగా నిర్వహించడం,   మాటలు  నిర్ణయాలలో సమతుల్యతను కాపాడుకోవడం. ప్రతి పరిస్థితిలోనూ ప్రశాంతంగా ఆలోచించి, సరైన సమయంలో తమ జ్ఞానాన్ని ఉపయోగించే వారు మాత్రమే జీవితంలో నిజమైన విజయాన్ని సాధిస్తారని చాణక్య నీతి బోధిస్తుంది. చాకచక్యం ఏదైనా పనిని సులువుగా,  ఎలాంటి సమస్య లేకుండా చేయడం.  కాబట్టి చాకచక్యంగా ఉండటం ముఖ్యమే కానీ తెలివైన వారు కూడా మూర్ఖుడిలా నటిస్తూ సరైన జీవితాన్ని గడపడం చాలా ముఖ్యం.

                              *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu