విశాఖ స్వరూపానంద ఆశ్రమం మూసేస్తారా?
posted on Feb 24, 2021 3:27PM
విశాఖపట్నంలోని శారధా పీఠం మూత పడనుందా? స్వరూపానంద స్వామికి షాక్ తగలనుందా? కొంత కాలంగా వివాదంలో చిక్కుకుంటున్నారు స్వరూపానంద. ఆయనకు రాజకీయ పార్టీలతో ఉన్న సంబంధాలపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆయన బహిరంగంగానే మద్దతు తెలుపుతుండటంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా స్వరూపానంద మఠంపై ఓ వ్యక్తి ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎన్నికలు ముగిసే వరకు ఆశ్రమాన్ని మూసివేయాలని అందులో కోరాడు.
విశాఖపట్నంకు చెందిన రామ్ స్వరూపానంద ఆశ్రమాన్ని ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. స్వరూపానంద ఓ దొంగ స్వామి అని అతను మండిపడ్డారు. స్వరూపానంద ఆశ్రమం వైసీపీ పార్టీ అడ్డాగా మారిందని తప్పుబట్టారు. భీమిలిలోని 15 పంచాయతీల్లో వైసీపీ బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని విమర్శించారు. ఇందులో ఆశ్రమం నిర్వాహకులకు సంబంధం ఉందని చెప్పారు. స్వరూపానంద ఆశ్రమాన్ని మూసివేయడంతో పాటు భీమిలిలో మళ్లీ ఎన్నికలు జరిపించాలని కోరామని రామ్ తెలిపారు.