రాహుల్ ఆ విషయంలో వీక్..
posted on Feb 24, 2021 3:50PM
వయనాద్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫైర్ అవుతూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ అసమర్థ ఎంపీ అని దుయ్యబట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేరళలో రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో స్మృతి ఇరానీ ఈ విధంగా స్పందించారు. అమేథీలో ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ మీద విషం చిమ్ముతున్నారని స్మృతి ఇరానీ విమర్శించారు. అమేథీ ఆయనకు అన్నీ ఇచ్చిందని, ఆయన అసమర్థత వల్లే అక్కడి నుంచి పారిపోయారని దుయ్యబట్టారు. చివరికి అన్ని ఇచ్చిన అమేథీ ప్రజలను అవమానించారని ఆరోపించారు. అస్సాం వెళ్ళిన రాహుల్ గాంధీ గుజరాత్ ప్రజలను అవమానించడం అమానుషమని అన్నారు.
దేశాన్ని ముక్కలు చేయాలనుకునే దేశ విద్రోహ గ్యాంగ్‌కు రాహుల్ మద్దతు పలికారన్నారని. పదిహేనేళ్లపాటు అసమర్థ ఎంపీని అమేథీ ప్రజలు భరించారని స్మృతి హిరానీ అన్నారు. గాంధీ కుటుంబం ‘విభజించు, పాలించు’ సిద్ధాంతాన్ని ఇప్పుడు చూపిస్తున్నారని ఆమె చెప్పారు. రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. అమేథీ తన కుటుంబమని, అమేథీని అవమానిస్తే తాను భరించలేనని స్పష్టం చేశారు. అంతకుముందు స్మృతి ఇరానీ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘కతఘ్నుడు. జ్ఞానం లేకుండా వాగేవాడి గురించి లోకమంతా చెప్తోంది’’ అని చెప్పారు. రాహుల్ గాంధీ ఇటీవల కేరళలో మాట్లాడుతూ, తాను ఓ ప్రత్యేక తరహా రాజకీయాలకు అలవాటుపడ్డానన్నారు. కేరళకు రావడం చాలా ఉత్తేజభరితంగా ఉందన్నారు. ప్రజలు సమస్యల పట్ల శ్రద్ధ చూపిస్తుండటం, కేవలం పైపైని కాకుండా లోతుగా తరచి చూసే ప్రజలు కనిపించడం అకస్మాత్తుగా తనకు కనిపించినట్లు తెలిపారు.దీంతో ఉత్తరాది, దక్షిణాది చర్చ మొదలైంది. అయితే రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వయనాద్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యంవహిస్తున్నారు.