రేవంత్ ఉచ్చులో కేటీఆర్‌.. త‌ప్పించుకునేదెలా! ?

తెలంగాణలో రాజ‌కీయాలు మ‌రింత‌ హీటెక్కాయి. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు సినిమా హీరో అల్లు అర్జున్ అరెస్టుతో జాతీయ మీడియా మొత్తం తెలంగాణపై ఫోక‌స్ పెట్టగా.. దేశంలోని రాజ‌కీయ నాయ‌కులు రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంది? రేవంత్ స‌ర్కార్ ఏం చేస్తోంది? అనే అంశాల‌పై ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు. దాదాపు వారం రోజుల పాటు అల్లు అర్జున్ అరెస్టు ఘ‌ట‌న‌ రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. అయితే,  ఈ వ్య‌వ‌హారం స‌ర్దుమ‌ణ‌గ‌క ముందే తాజాగా రేవంత్ స‌ర్కార్ మ‌రో బాంబు పేల్చింది. ఈసారి ఏకంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు గురిపెట్టింది. ఫార్ములా ఈ-కార్ రేసు వ్య‌వ‌హారంలో రేవంత్ స‌ర్కార్ కేటీఆర్ కు ఉచ్చు బిగిస్తోంది. అయితే, గ‌త నెల రోజులుగా ఫార్ములా ఈ-కార్ రేసు వ్య‌వ‌హారంలో కేటీఆర్ అరెస్టు ఉంటుంద‌ని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది. సీఎం రేవంత్ స‌హా ప‌లువురు మంత్రులు కేటీఆర్ అరెస్టు కావ‌టం ఖాయ‌మంటూ గ‌తంలో పేర్కొన్నారు. కేటీఆర్ సైతం స్పందిస్తూ.. అరెస్టు చేసి జైలు పంపిస్తే హాయిగా వెళ్తా.. జైల్లో యోగా చేసి మంచి ఫిట్ నెస్ తో బ‌య‌ట‌కు వ‌చ్చి పాద‌యాత్ర చేస్తా అంటూ కౌంట‌ర్ ఇచ్చారు. తాజాగా కేటీఆర్‌ను విచారించేందుకు గ‌వ‌ర్న‌ర్ నుంచి అనుమ‌తులు   రావ‌డంతో ఏసీబీ రంగంలోకి దిగింది.

 ఫార్ములా ఈ-కార్ రేసు వ్య‌వ‌హారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదైంది. ఆయ‌న‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పైనా, అలాగే ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదు అయ్యింది. ఏ1గా కేటీఆర్, ఏ2 ఐఏఎస్ అరవింద్‌ కుమార్‌‌, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డిని చేరుస్తూ ఏసీబీ కేసు ఫైల్ చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు పెట్టింది.  తాము కేటీఆర్ పై  కేసులు పెట్టామని నాంపల్లి కోర్టుకు ఏసీబీ అధికారులు తెలిపారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు కావడంతో నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టుచేయడానికి అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. త‌న‌పై కేసు న‌మోదు కావ‌డంపై కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈ-కారు రేసులో కుంభ‌కోణం జ‌రిగింద‌ని అంటున్నారు. ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ది ఉంటే ఈ వ్య‌వ‌హారంపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ‌పెట్టాలి. ఫార్ములా ఈ-కారు రేసుపై అన్ని వాస్త‌వాలు వివ‌రిస్తా అని పేర్కొన్నారు. మ‌రోవైపు రేవంత్ స‌ర్కార్ పై ఎమ్మెల్సీ క‌విత తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్‌, బీఆర్ఎస్‌ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌నే ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు.  

2023, ఫిబ్రవరి 11న ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపు 2.8 కిలోమీటర్ల ఈ కార్ రేసింగ్ పెట్టింది. అయితే ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి దాదాపు రూ.55 కోట్ల వరకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, సంబంధిత డిపార్ట్‌మెంట్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి నిధులు విడుదలయ్యాయి. అయితే రూ.55 కోట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగం జరిగిందని  కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ నిధుల గోల్‌మాల్‌పై విచారణకు సర్కార్ ఆదేశించింది. ఆర్థికశాఖ అనుమతులకు సంబంధించి ఎక్కడా రికార్డ్స్‌లో లేకపోవడంతో నిధుల గోల్ మాల్ వాస్తవమేనన్న అనుమానాలు   వ్యక్తమయ్యాయి. విదేశీ కంపెనీలకు ఇంత భారీ మొత్తాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా ఏ విధంగా అప్పగించారన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రజా ప్రతినిధులపై కేసులు నమోదు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితమే రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వగా.. మూడు రోజుల క్రితం సీఎస్ కూడా ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఏసీబీకి లేఖ రాశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

ఈ కేసుకు సంబంధించి మొదటగా ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసి అనంతరం విచారణ జరుపనున్నారు. కేటీఆర్ ను విచార‌ణ‌కు పిలిచి అరెస్టు చేస్తార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేస్తోంది. బంజారాహిల్స్ ఏసీబీ కార్యాల‌యంలో అధికారులతో ఏసీబీ డీజీ విజయ్ కుమార్ సమావేశం అయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచి, ఆయనను   ఎలా విచార‌ణ‌ చేయాలి, ఒకవేళ విచారణకు కేటీఆర్ సహకరించకపోతే,  న్యాయస్థానాలకు వెళితే ఎలా డిఫెండ్ చేయాలి, అందులో విధివిధానాలు ఏంటి.. అనే అంశంపై ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. లీగల్ టీమ్, ఎవిడెన్స్ టీమ్, ఐటీ సెల్ టీమ్.. ఇలా అన్ని విభాగాలకు చెందిన అధికారులతో స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లో మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. విదేశీ కంపెనీలకు నిధుల విడుదల నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతే కేసు నమోదు చేసినట్లు ఏసీబీ చెబుతోంది. ఈ క్ర‌మంలో కేటీఆర్ విచార‌ణ‌కు హాజరైతే ఆయ‌న్ను అరెస్టు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఏసీబీ అరెస్టు నుంచి త‌ప్పించుకునేందుకు కేటీఆర్ సైతం త‌న ప్ర‌య‌త్నాల‌ను షురూ చేశారు. ఆయ‌న  హైకోర్టును ఆశ్రయించనున్నారని సమాచారం. శుక్ర‌వారం (డిసెంబర్ 20) హైకోర్టులో క్వాష్​ పిటీషన్​ వేయనున్నారని తెలిసింది.  మ‌రోవైపు.. కేటీఆర్ ను అరెస్టు చేస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ అదుపు త‌ప్పే అవ‌కాశాలు   ఉన్నాయ‌ని స‌ర్కార్ భావిస్తోంది. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ‌ను డీజీపీ ఇప్ప‌టికే అలెర్ట్ చేసిన‌ట్లు స‌మాచారం.