వెంకటాపురం.. వంద శాతం తెలుగుదేశం సభ్యత్వం

ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచీ బలపడేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పార్టీ ఇప్పటికే అన్ని వర్గాల మద్దతూ సాధించింది. ఆ సంగతి ఇటీవల  టీడీపీ తన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నిర్ద్వంద్వంగా రుజువైంది.

తెలుగుదేశం సభ్యత్వ నమోదు డ్రైవ్ ద్వారా దాదాపు 73 లక్షల మంది  పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వీరిలో   54శాతం మంది కొత్త వారే.  ఒక రాజకీయ పార్టీ సభ్యత్వ నమోదు లో ఇంత పెద్ద సంఖ్యలో కొత్త వారు సభ్యత్వం తీసుకోవడం ఒక రికార్డు అనుకుంటే..దానిని తలదన్నే రీతిలో ఒక గ్రామంలో మొత్తం జనాభా అంతా తెలుగుదేశం సభ్యులుగా నమోదు చేసుకోవడం ద్వారా నభూతో.. నభవిష్యతి అన్న రికార్డు కూడా తెలుగుదేశం వశమైంది.

ఇంతకీ ఆ గ్రామం ఏదో తెలుసా.. దివంగత పరిటాల రవి స్వగ్రామం వెంకటాపురం.  ఆ  గ్రామంలోని ఓటర్లందరూ తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారు. ఇలా ఒక గ్రామంలో నమోదైన ఓటర్లందరూ పార్టీ సభ్యత్వం తీసుకుని అనితర తెలుగుదేశం పార్టీకి అనితర సాధ్యమనదగ్గ రికార్డును అందించారు.   వెంకటాపురంలో మొత్తం 581 మంది ఓటర్లు ఉండగా, వారిలో  11 మంది మరణించారు. మిగిలిన 570 మంది ఓటర్లు అందరూ తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారు. తద్వారా తెలుగుదేశం పార్టీ, పరిటాల కుటుంబం పట్ల తమకున్న అభిమానాన్ని చాటారు. ఈ విషయంపై రాప్తాడు ఎమ్మెల్యే, పరిటాల రవి భార్య పరిటాల సునీత మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత   ఈ ఘనత సాధించిన మొదటి గ్రామం వెంకటాపురం అని చెప్పారు. పార్టీ పట్ల, తమ కుటుంబం పట్ల ప్రజలు చూపుతున్న అభిమానానికి కృతజ్ణతలు తెలిపారు.