ప్రపంచ వ్యాప్తమైన వివేక వాణి!!

 

వివేకం అంటే బుద్ధి. ఆలోచన కలిగినది, అర్థం చేసుకోగలది, పరిపక్వత కలిగి అన్నిటినీ సమ దృష్టితో చూడగలిగేది వివేకం యొక్క గొప్ప లక్షణం. ఈ వివేకాన్ని మెండుగా కలిగిన వారు వివేకులు. వివేకులు ఎప్పుడూ స్థిరంగా ఉంటారు. వారిలో ఖచ్చితమైన దృఢచిత్తం ఉంటుంది. దేనికీ భయపడరు, బాధపడరు, ప్రపంచాన్ని అన్నివైపుల నుండి చూస్తూ అన్ని కోణాలలో అన్ని విధాలుగా అర్థం చేసుకోగలుగుతారు. అలాంటి వివేకాన్ని తన పేరులో నింపుకుని, ప్రపంచానికి వివేకాన్ని పంచిన మహనీయుడు స్వామి వివేకానంద!!ఈయన పేరు వింటే ప్రపంచదేశాలలో భారతీయ హైందవ ప్రవచనాల పరంపర గుర్తొస్తుంది. బాధ్యతాయుతమైన యువతరపు నెత్తురు ఉరకలేస్తుంది. 1863 జనవరి 12వ తేదీన జన్మించిన వివేకానందుడి అసలు పేరు నరేంద్రుడు.

రాజు సభలో బుల్లిరాజు!!

బాల్యం నుండే నరేంద్రుడిలో భావి మహత్వ సూచనా లక్షణాలు కానవచ్చాయి. ఇతడు మహోత్సాహ వంతుడు, వ్యాకుల మనస్కుడు. అప్పుడప్పుడు హఠాత్తుగా ఇతడు ఉద్రిక్తుడయ్యేవాడు. తల్లి దీనికొక విచిత్రమైన నివారణోపాయాన్ని కనుగొంది. ఇతణ్ణి కుళాయి నీళ్లకింద కూర్చోబెట్టి శివనామాన్ని జపింప చెయ్యటమే ఆ చికిత్స, నరేంద్రుడు ఎదిగేకొద్దీ అతడిలో అసాధారణ ఉదార ప్రవృత్తులు కనిపించసాగాయి. బిచ్చగాళ్లకు, సన్న్యాసులకు విలువైన వస్తువులను మరో ఆలోచన లేకుండా ఇచ్చి పంపేవాడు. పెంపుడు జంతువులన్నా, పక్షులన్నా ఇతడికి ఎంతో ఇష్టం. ఆవు, కోతి, నెమలి, పావురం, రెండు మూడు గినీ పందులను ఇతడు పెంచేవాడు. కొరడా చేతపుచ్చుకొని గుర్రపుబండిని తోలే 'కోమ్మాన్' ఈ పసివాడి ఊహాలోక నాయకుడు. నరేంద్రుడు తన తోటి బాలుర మన్ననలకు పాత్రుడైన నేత, 'రాజు సభ' అనే ఆటంటే ఇతడికెంతో ఇష్టం. దాన్లో నరేంద్రుడు ఎప్పుడూ రాజు' పాత్రను వహించేవాడు, మిత్రులను అధికారులుగా నియమించేవాడు. ఇలా చిన్ననాటి నుండే ఈయణలో నాయకత్వ లక్షణాలు పురుడుపోసుకున్నాయి.

అధ్యాత్మ అద్భుత మార్గం!!

చిన్నప్పటి నుండి తెలియకుండానే ధ్యానంలో కూర్చోవడం నరేంద్రుడి జీవితంలో అనుకోకుండా జరిగిపోయేది. అలా ధ్యానం చేయడం కూడా ఈయనకు ఆటగా అనిపించేది. అది క్రమంగా పెరుగుతూ ఆయన్ను ఆధ్యాత్మిక సాధన వైపుకు తీసుకెళ్లి రామకృష్ణుల వారి శిష్యుడిని చేసింది. బెలూరులో రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాన్ని స్థాపించారు ఈయన. ప్రపంచ దేశాలకు భారతీయ హిందూ ధర్మం గురించి ప్రచారం చేసి, అదే విదేశాలలలో పర మతం ముందు భారతీయ సనాతన ధర్మం విశిష్టతను, అందులో మార్మికాన్ని, ఆఫహ్యాత్మికథను, తాత్వికతను ఎలుగెత్తి చాటిన మహనీయుడు.

కెరటాల ఆదర్శప్రాయుడు!!

కెరటం నా ఆదర్శం. లేచి పడినందుకు కాదు, పడి కూడా మళ్లీ లేచినందుకు అంటాడు వివేకానందుడు. ప్రయత్నాల పోరాటంలో వైఫల్యాలను అధిగమించి గెలుపుకై సాగిపోవాలని యువతకు ఉగ్గుపోసినట్టు తన మాటల అస్త్రాలతో ఎన్నెన్నో సూక్తులను చెప్పి భావిభారత అభివృద్ధికి యువతే ముఖ్యమని వారు ఎప్పుడూ విల్లు విడిచిన బాణాల్లా దూకుపోయి దేశాన్ని వెలిగించాలని పిలుపునిచ్చినవాడు.

సోదర, సోదరీ బందానికి మూలకర్త!!

ఈయన చికాగో ప్రసంగం ఎంతో ఖ్యాతి పొందింది. ఆనాటి ఆయన ప్రసంగంలో విదేశీయులను, అక్కడున్న సకల ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మొదటి మాట  "సోదరసోదరీమణులారా" అని. ఆ ఒక్క మాటతో మనుషులు, దేశాలు, ఖండాల మధ్య ఉన్న వ్యత్యాసం అంతా తుడిచిపెట్టుకుపోయి అందరూ ఒకటే అనే భావనను కలుగజేసింది.

ఇట్లా ఆధ్యాత్మికం, తత్వం, వేదాంతం అన్నిటినీ మేళవించుకున్న వివేకానందుడు భారతీయ యువతకు గొప్ప ఉత్ప్రేరకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన తన 39 సంవత్సరాల వయసులో అనారోగ్యం బారిన పడి మరణించారు. ఆ 39 సంవత్సరాల కొద్ది కాలంలోనే యావత్ ప్రపంచానికి తన వాణిని వినిపించాడని, అది అందరి మీద ప్రభావం చూపిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా!! 

ఆయన జన్మదినాన్ని యువజన దినోత్సవంగా జరుపుకుని యువత తమ వంతు పాత్రగా దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకొస్తే అదే ఆయనకు ఇచ్చే నివాళి అవుతుంది.

◆వెంకటేష్ పువ్వాడ