అలసట వీడని వలస ప్రయాణం !!

 

ప్రపంచంలో ప్రతి ప్రాంతంలో ఎక్కువగా కనబడేది వలస. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పొట్టకూటి కోసం కొందరు, బతుకు తెరువు కోసం కొందరు, బతుకును ఇంకా మెరుగు పరుచుకోవాలని కొందరు, ఆశాజనకమైన జీవితంలో అందలాలు ఎక్కాలని కొందరు ఇలా కారణాలు ఎన్నో ఉన్నా వలస అనేది నేటి భారతాన్ని పత్తి పీడిస్తున్న పెద్ద సమస్య.పల్లెల నుండి పట్టణాలకు, పట్టణాల నుండి రాష్ట్రాలకు, రాష్ట్రాల నుండి దేశాలకు సాగుతున్న ఈ వలస దారుల పరంపర భారతదేశ అభివృద్ధినిపై కూడా ప్రభావం చూపిస్తోందని చెప్పవచ్చు.

ఒకప్పుడు!!

గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు పడక, పంటల కళ లేక, కరువు తాండవించి, భూములు బీడెక్కి తిండి గింజ లేక, కొనుక్కోవడానికి పైసా చేతిలో లేక ఎన్నో అవస్థలు పడేవాళ్ళు. అలా గ్రామీణ ప్రాంతాలలో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలలో ఒకరో ఇద్దరో పట్టణాలకు వెళ్లి అక్కడ భవన నిర్మాణ పనులు, రోడ్డు నిర్మాణ పనులు, ఫ్యాక్టరీలలో పనులు, రోజు వారీ కూలీలుగా ఇలా ఎన్నో పాత్రలలోకి మారిపోయి నాలుగు కాసులు జేబులో నింపుకుని, తాము తిని అంతో ఇంతో పల్లెల్లో ఉన్న కుటుంబాలకు కూడా పంపేవారు. 

అయితే ఈ వలస కూడా క్రమంగా కొత్త పుంతలు తొక్కుతూ వస్తోంది.

నయా వలసల మేళా!!

నిజానికి  ఏదో కాలం బాగోలేక పల్లెల్లో బాగుకు బారమై పట్టణాలకు వెళ్ళడాన్ని వలసగా చిత్రించిన సమాజం, నేటి ధనవంతులు, విద్యాదికులు చేస్తున్నదానికి ఆ పదాన్ని అపాదించడానికి తటపటాయిస్తుంది ఎందుకో మరి.

చక్కని చదువు, మంచి ఉద్యోగం, ఆశించినంత వేతనం. ఇవన్నీ ఉన్నా నేటి యువత విదేశాలకు వినీలాకాశంలో రెక్కలు కట్టుకుని వెళ్లిపోతున్నాయి. ఫలితంగా ఎంతో మేధస్సు కలిగిన భారత యువత తమ తెలివితేటలను పక్క దేశాలకు అమ్మేస్తూ వారి చెంతన అతిథులుగా ఉంటున్నారు. నిజానికి ఈ డిజిటల్ యుగంలో అన్ని చోట్లా తమదైన ముద్ర వేస్తున్న వాళ్లలో భారతీయులే ఎక్కువ ఉన్నారు. అదే ప్రతిభ పుట్టిన దేశం కోసం వినియోగిస్తే భారత్ కూడా సాంకేతిక అభివృద్ధిలో కొత్త దారుల్లో పరుగుపెట్టి, నిరుద్యోగ విలాపాన్ని తగ్గించుకుంటుంది.

ఇలా కొత్తరకపు విద్యావంతుల వలస కూడా భారతదేశ ఆర్థిక, అభివృద్ధి, సామాజిక తీరుపై ఎంతో ప్రభావం చూపిస్తోంది. విదేశాలకు తరలిపోవడం ఒక స్ట్రేటజీగా భావిస్తున్న వాళ్ళు ఆ రెక్కల లోకం అంతా ఆకాశం లాంటిదే అని, ఎప్పటికీ పుట్టిన దేశమే నడక నేర్చిన భూమే తల్లిలాంటిదని తెలుసుకునే సమయం రావాలి.

రంగుల జీవితం, మాటల మాయలో గందరగోళం!!

ఇవన్నీ ఒక ఎత్తైతే అసలైన వలస మరొకటి ఉంది. ఎక్కువ జీతం ఇస్తారనే ఆశతో కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా లాంటి దేశాలకు వలస పోతున్న వాళ్ళు భారతదేశంలో కోకొల్లలు. తీరా అక్కడికి వెళ్ళాక అడ్డమైన చాకిరీ చేయలేక ఆ అరబ్బుల హింసలు భరించలేక, దొంగ వీసాలు, వీసా కాలం చెల్లిపోయి తిరిగి రాలేక సతమతం అవుతున్న వాళ్ళు ఎందరో!! వాళ్లలో ఆడవాళ్ళ జీవితాలు మరీ ఘోరంగా ఉంటాయి. 

పిల్లలను చదివించాలని, పెళ్లిళ్లు చేయాలని, తిండి లేక అల్లాడుతున్న కుటుంబాల కళ్ళలో వెలుగు నింపాలని ఇలా ఎడారి దేశాలకు వలస పోయి, అక్కడ దుర్భరమైన జీవితాలు వెళ్లదీస్తున్న వారిని ఉద్దేశిస్తూ సినిమాలు, సాహిత్యంలో కథలు, కథల పుస్తకాలు కూడా వెలువడ్డాయి అంటే ఆ జీవితాలు ఎంత ప్రభావితం అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 

సమైక్య సంపాదనే పరిష్కారం!!

జీవించడం ఖరీదుగా మారిపోతోంది. కాలంతో పాటు ఖర్చులు పెరిగిపోతున్నాయి. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒకరి సంపాదనతో జీవించం ఈ కాలంలో ఎంతో కష్టం. అందుకే సమైక్య సంపాదనే జీవితాలు బాగుండటానికి పరిష్కారమని అర్థం చేసుకోవాలి. కనీసం రెండు చేతుల సంపాదన సాధ్యమైతే కుటుంబం కాస్త ప్రశాంతంగా ఉండగలదు.

ముఖ్యమైన సూత్రం!!

అందరూ చదువుకుంటేనే ఉద్యోగం అనుకుంటారు. చదువుకు ఉద్యోగానికి సంబంధం ఉన్న, చదువు లేకుండా వ్యాపారాలు చేస్తూ విజృంభిస్తున్న ఎన్నో జీవితాలు భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి చదువును చదువుగా చూస్తూ, చదువు ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకుని, జీవితానుభవాల ద్వారా సమాజాన్ని చదువుతూ సంపాదనకు సోపానాలు నిర్మించుకోవాలి.

లేకపోతే వలస అనే రాకాసి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది.

◆ వెంకటేష్ పువ్వాడ