సంక్రాంతి పతంగుల పండుగ!! 

పతంగం అంటే గాలిపటం. రెండు కాగితాలు వాటి మధ్యన వెదురు బద్దలు, దారం, రంగులు, కాసింత జిగురు ఇవన్నీ ఉంటే అందరికీ ఎంతో ఇష్టమైన గాలిపటం తయారైపోతుంది. తొమ్మిది మైళ్ళ తొకతో ఆకాశంలోకి ఎగిరి వయ్యారాలు పోయే గాలిపటం అంటే చెప్పలేనంత సరదా. తెలుగువారి పెద్ద పండుగ, రైతన్నలు సంబరంగా జరుపుకునే పండుగ, కొత్త అల్లుళ్ళ కోరికల పండుగ, ఎద్దుల పందేలు, ఎడ్ల బండ్ల సందడి నెలకొనే పండుగ. ఇంకా చెప్పాలంటే పిండివంటల పసందైన పండుగ. ఇంత గొప్ప సంక్రాంతి రోజున గాలిపటాల హంగామా తోడైతే చెప్పలేనంత సంతోషం నెలకొంటుంది. అయితే ఈ పతంగుల సంబరాన్ని ఏదో గాలిపటం ఎగరేసినట్టు కాకుండా ప్రత్యేక పండుగగా కూడా జరుపుకుంటారు. కైట్ ఫెస్టివల్ పేరుతో పాశ్చాత్యదేశాలలో కూడా సందడి చేస్తుంది గాలిపటం.

అయితే ఈ గాలిపటాల సంబరంలో అపశృతులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వాటివల్ల తీరని నష్టం జరుగుతుంటుంది. జాతీయ అంతర్జాతీయ విషయాల గురించి కాదు కానీ ప్రతి వ్యక్తి చేతిలో కొంత బాధ్యత ఉంటుంది. దాని ప్రకారంగా ఏది చేసినా నష్టాన్ని నివారించవచ్చు. పతంగుల పండుగ ఆస్వాదించాలంటే నివరించాల్సినవి, పాటించాల్సినవి తెలుసుకోవాల్సిందే మరి.

ప్రమాదకరమైన పరిసరాలు!!

గాలిపటాలు ఎగరేయడానికి విశాలమైన ప్రాంతాలు ఉండేలా చూసుకోవాలి. బిల్డింగ్ లు, చెట్లు, కరెంట్ స్తంభాలు వంటి వాటి చుట్టూ గాలిపటాలు ఎగరేయడం మంచిది కాదు. శీతాకాలపు మంచు వల్ల కరెంట్ తీగలు, స్తంభాలు వంటి చోట్ల తేమ ఉంటుంది. గాలిపటాలు ఆ తేమ బారిన పడితే ఘోరమైన కరెంట్ షాక్ కొట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి పరిసరాల్లో గాలిపటాలు ఎగరేయడానికి ఉవ్విళ్లూరకండి.

విహంగాల మరణానికి బాధ్యులు కారాదు!!

విహంగాలు మనుషుల స్వేచ్ఛకు ఒక గొప్ప ఉపమానాలు. అయితే ఈ గాలిపటాల గందరగోళంలో వేలకొద్ది పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయంటే ఎంతో విచారం కలుగుతుంది. గాలిపటాలు తెగిపోయి ఎక్కడెక్కడో చెట్ల కొమ్మల్లోనూ, కరెంట్ తీగల్లోనూ, టెర్రస్ ల మీద ఇరుక్కుపోయి అవి కాస్తా పక్షుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. పక్షుల రెక్కలకు బిగుసుకుని, కాళ్ళకు బిగుసుకుని, గొంతులకు ఉచ్చులా మారి పక్షులను నేలరాలుస్తున్న పాపం ఈ గాలిపటాల మాంజాలదే. మన వినోదం కాస్తా పక్షుల పాలిట యమపాశం అవుతుంటే సిగ్గుపడాల్సిన విషయమే ఇది. మాంజా కు గాజుపెంకుల పొడి పూస్తారు. ఫలితంగా  ఆ దారం ఎంతో పదునుగా ఉండి తొందరగా పక్షులమీద ప్రభావం చూపిస్తోంది.

పందేలు శృతిమించరాదు!!

గాలిపటాలు ఎగరేయడం గమ్మత్తైన ఆట. ఇదొక పందెమే. సంక్రాంతి కోడి పందెల్లానే గాలిపటాల పందేలు కూడా జోరుగానే సాగుతాయి చాలాచోట్ల. ఈ గాలిపటాల హొయలును తెలుపుతూ నాటి పాత సినిమాలో  పదపదవే వయ్యారి గాలిపటమా….. అని పాటతో పసందు చేసినా, గాలిపటమా పద పద పదా 

హంసలాగా పదపద 
ఆకాశమే మరి మనకిక

హద్దుకాదు పదపద అని ఆలపిస్తూ పైకి పోయే పతమే, ఇది పందెం గెలిచే పతమే, సూపరు స్టారు పవరే పతంగం అని ఇప్పటికీ ఉర్రూతలూగించినా అది గాలిపటాల పందెంలో ఉన్న ఉల్లాసమే అని గుర్తించాలి.

అదేమీ కాకుండా మనసులో కోపం, ద్వేషం పోగేసుకుని పళ్ళునూరుతూ కళ్ళల్లో కారాలు చిమ్ముతూ పందేలు పెట్టుకుని దాన్ని గొడవలకు దారితీసుకోకూడదు. కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే పందెం కూడా ఆరోగ్యకరంగా ఉండాలని.

పై విషయాలు మాత్రమే కాకుండా మనం ఏమి చేసినా అది చుట్టుపక్కల ఉన్నవారికి ఏ విధంగానూ ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు. కాబట్టి పతంగుల పండుగను విశాలమైన ప్రాంతాలలో, పక్షులకు హాని కలగకుండా, ఎటువంటి ప్రమాదాలకు గురవ్వకుండా, గొడవలకు దారితీయకుండా ఉండేలా జరుపుకోవాలి. అప్పుడే గాలిపటమా పద పద పదా అంటూ ఆ క్షణాలను ఆస్వాదించగలుగుతారు.

◆ వెంకటేష్ పువ్వాడ