జగన్‌కు ఊడిగం చేశారు.. ఇప్పుడు ఇరుక్కున్నారు!
posted on Mar 24, 2025 8:47AM

ఎట్టకేలకు రాష్ట్ర సమాచారశాఖ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి పాపం పండింది. వైసీపీ హయాంలో అనేక అవినీతి,అక్రమాలు, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన విజయకుమార్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, చెప్పాపెట్టకుండా ఢిల్లీకి వెళ్లిపోయారు. జగన్ మీడియాతో పాటు ఆయనకు భజన చేసిన కొన్ని టీవీ చానళ్లు, మరిన్ని యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియాకు నిబంధనలు ఉల్లంఘించి వందల కోట్ల రూపాయలను ప్రకటనల రూపంలో దోచిపెట్టారని ఆయనపై అభియోగాలున్నాయి. ఎట్టకేలకు విజయ్‌కుమార్‌రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో ఆయనకు కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేంద్ర సర్వీసులకు చెందిన ఆయన ప్రస్తుతం కోల్‌కతాలో పనిచేస్తున్నారు. ఈ-మెయిల్ ద్వారానేగాక హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి కూడా ఏసీబీ నోటీసులు పంపింది. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌కు చెందిన విజయ్‌కుమార్‌రెడ్డి, జగన్ పాదయాత్ర సమయంలోనే ఆయనకు మద్దతు ప్రకటించి జగన్ భజన మొదలుపెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక 2019లో డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. 2024 వరకు సమాచార శాఖ కమిషనర్‌గా విచ్చలవిడి వ్యవహారాలు చేపట్టారు. జగన్ సొంత మీడియాతో పాటు అనుకూల మీడియా, భజన మీడియాకు ప్రభుత్వ ప్రకటనల రూపంలో అడ్డగోలుగా వందల కోట్ల రూపాయలు దోచిపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ఓడించి గత ఏడాది గద్దెనెక్కిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే బాధ్యతను ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి విజయ్‌కుమార్‌రెడ్డిపై గుంటూరులో కేసు నమోదు చేశారు.
రాష్ట్ర సర్వీసుల నుంచి వెళ్లిపోతే, తన అవినీతి, అక్రమాలు బయటకు రావనీ, తనను ఎవరూ ఏమీ చేయలేరని విజయ్‌కుమార్‌రెడ్డి భావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గత ప్రభుత్వంలో అవినీతిపై ఆచితూచి చర్యలు తీసుకుంటుండడంతో, తనను ఏమీ చేయరనే ధీమాతో విజయ్‌కుమార్ కనిపించారు. అయితే, విజిలెన్స్ విచారణలో ఆయన చేసిన అవినీతి, అక్రమాలు, అనైతిక కార్యక్ర మాలు బట్టబయలు కావడంతో ఇప్పుడు ఏసీబీ అధికారుల ముందు నిల్చోవాల్సి వచ్చింది. జగన్ అధి కారంలోకి రాకముందే, రాష్ట్ర సంపదను ఎలా జగన్‌కు దోచిపెట్టాలన్నదానిపై ఒప్పందం చేసుకు, రాష్ట్రానికి వచ్చిన విజయ్‌కుమార్‌రెడ్డి వచ్చిన వెంటనే పనిలోకి దిగిపోయారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విజయ్‌కుమార్‌రెడ్డి చేసిన మొదటి పని పత్రికల టారిఫ్ పెంపుదల. పత్రికా యాజమాన్యాలు ఎవరూ అడగకపోయినా..అన్ని పత్రికల టారిఫ్ పెంచేశారు. ఎవరూ అడగకుండానే టారిఫ్‌లు పెంచడంతో అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు. కేవలం పెద్ద పత్రికలకే కాదు..చిన్న పత్రికలకు కూడా టారిఫ్ పెంచేశారు. ఎవరో ఒకరు కోర్టులో కేసులు వేసి, జగన్ మీడియాకు దోచిపెట్టకుండా అడ్డుకుంటారన్న భావనతో..అందిరికీ పెంచేశారట.
అయితే రేట్లు పెంచారు కానీ, ఇతర పత్రికలకు ఐదేళ్లలో కనీసం ఒక్క ప్రకటన ఇచ్చిన పాపాన పోలేదు. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, చిన్నపత్రికలకు ఎన్నోకొన్ని ప్రకటనలు ఇచ్చేవి. ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడల్లా, వారికీ ప్రకటనలు ఇచ్చేవి. కానీ జగన్, విజయ్‌కుమార్‌రెడ్డిలు ఐదేళ్లలో ఒక్క ప్రకటనా ఇచ్చిన పాపాన పోలేదు. జగన్ సొంత మీడియాతోపాటు అనుకూల మీడియా, భజన మీడియాకు ప్రభుత్వ ప్రకటనల రూపంలో అడ్డగోలుగా వందల కోట్లు దోచిపెట్టారు.
ఇప్పుడు విజయ్‌కుమార్‌రెడ్డి ఏసీబీ విచారణకు హాజరుకాకుండా రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. విచారణకు రావాలని శుక్రవారం ఆయనకు నోటీసు ఇవ్వగా, తాను ఇప్పుడు బిజీగా ఉన్నానని, రానని.. వీలు చూసుకొని ఏప్రిల్‌లో వస్తానంటూ సమాధానమిచ్చారు. విజయ్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. అది విచారణలోనే ఉంది. అరెస్టు నుంచి ఆయనకు ఎలాంటి రక్షణ లేదు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కాకుండా సాకులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు మరోసారి ఫలానా తేదీలో విచారణకు రావాలంటూ నోటీసులివ్వాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.