మెగా బ్రదర్ కి నిరీక్షణ తప్పదా?.. పిఠాపురం వర్మ ఎఫెక్టేనా?

కొణిదెల నాగేంద్రబాబు అలియాస్‌ నాగబాబు గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ  ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్‌ కల్యాణ్‌ కంటే ఎక్కువ పని చేసిన నాగబాబు.. ఆ తర్వాత చిరంజీవి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో సైలెంట్‌ అయ్యారు.. తరువాత జనసేన ఆవిర్భావం నుంచి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ వెంట నిలిచారు.  2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున ఎక్కడా పోటీ చేయని నాగబాబు,  2019లో జనసేన నుంచి నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

మొన్నటి  ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్‌సభకి పోటీ చేయాలని నాగబాబు భావించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో ఆయన పోటీ నుంచి విరమించుకున్నారని చెబుతుంటారు. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం, జనసేన వందశాతం స్ట్రైక్‌ రైట్‌ సాధించడం, జనసేనాని పవన్‌కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడంతో  నాగబాబుకు కూడా పదవి ఖాయమనే ప్రచారం ఏడెనిమిది నెలలుగా సాగుతోంది. తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నెలాఖరుకి మండలిలో పాత ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుండటంతో ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

గత డిసెంబర్‌ 9వ తేదీన రాజ్యసభకు అభ్యర్ధుల పేర్లను వెల్లడించిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సరిగ్గా అదే సమయంలో నాగబాబును ఎమ్మెల్సీగా ఎన్నిక చేయించి రాష్ట్ర క్యాబినెట్‌లోకి తీసుకుంటామని ప్రకటన చేశారు. వాస్తవానికి అప్పటి వరకు నాగబాబును రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం బలంగా జరిగింది. అయితే చంద్రబాబు ప్రకటనతో జనసేనకు రాజ్యసభ పోస్టు లేదనీ, దాని బదులు నాగబాబు రాష్ట్రంనుచే చట్టసభలోకి ప్రవేశిస్తారని స్పష్టమైంది. 

చంద్రబాబు తలచుకుంటే మంత్రి చేయడానికి ఈ ఎమ్మెల్సీ తంతు ఏమీ అడ్డం కాదు. మంత్రి అయిన ఆరు నెలలలోగా ఎమ్మెల్సీ కావచ్చు. కానీ అలా చేయలేదు. దాంతో కేవలం నాగబాబును చేర్చుకోవడం కోసం మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతున్నదా? అన్న చర్చ నడిచింది. కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర అయితే తప్ప మంత్రివర్గంలో మార్పులు చేర్పులు సాధారణంగా జరగవు. పైగా చంద్రబాబు వర్కింగ్ స్టైల్ వేరు. ఏ నిర్ణయం అంత వేగంగా, అంత సులభంగా తీసుకోరు. అదీ కాక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో తెలుగుదేశం శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. జనసేనకు అంత ప్రాధాన్యత ఇస్తుండటంపై పిఠాపురం తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే అసంతృప్తి మరింత పెరుగుతుంది. వర్మ, కిమిడి నాగార్జున ఇంకా చాలా మంది అర్హులైన నాయకులు బ్యాక్ బెంచ్లో కూర్చొని వెయిటింగ్లో ఉండగా, నాగబాబుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే ఇబ్బందని చంద్రబాబు సంశయిస్తున్నారన్న ప్రచారం  జరుగుతోంది.  వెయిటింగ్‌లిస్ట్‌లో ఉన్న టీడీపీ నేతలకు న్యాయం జరిగాకే నాగబాబుకి అమాత్య పదవి దక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది.

ఆ క్రమంలో ఇప్పట్లో నాగబాబును మంత్రిగా చూడడం కష్టం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ కాబట్టి. మంత్రి పదవి ఇవ్వాలంటే క్షణంలో ఇవ్వవచ్చు. కానీ ఈ లోగా పిఠాపురం సభలో చాలా డ్యామేజ్ చేసుకున్నారు. పవన్ కామెంట్లు కూడా టీడీపీని కొంత డ్యామేజ్ చేసేవి ఉన్నాయని తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఈ డ్యామేజ్ ఎఫెక్ట్‌తో నాగబాబుకి ఇప్పట్లో మంత్రి పదవి అన్నది ఉండదనే వాదన గట్టిగా వినిపిస్తోంది.