రూ. 59.70 కోట్లతో పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం

పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి మార్గం సుగమమైంది. కేందర రోడ్డు, మౌలిక సదుపాయాల నిధి (ఆఆర్ఐఎఫ్) పథకం కింద సామర్లకోట- ఉప్పాడ రోడ్డులో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం లభించింది. ఇందు కోసం 59 కోట్ల 70 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. 

గత ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చనున్నారు. ఇందు కోసం మంగళవారం (మార్చి 25) పరిపాలనా అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.

ఈ బ్రిడ్జి నిర్మాణ వ్యయాన్ని తొలుత రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆ తరువాత ఈ వ్యయాన్ని సీఆర్ఐఎఫ్ కింద కేంద్ర ప్రభుత్వం రియింబర్స్ చేస్తుంది.   రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు కావడం పట్ల పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని పవన్ కల్యాణ్ నెరవేర్చుకుంటున్నారని ప్రశంసలు గుప్పిస్తున్నారు.