వీణకి పాక్ కోర్టు జైలు శిక్ష
posted on Nov 26, 2014 8:56AM
ఇటీవల కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించిన పాకిస్థానీ హీరోయిన్ వీణా మాలిక్‌కి పాకిస్థాన్ తీవ్రవాద వ్యతిరేక కోర్టు 26 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. పాకిస్థాన్‌లోని జియో టీవీలో దైవదూషణ చేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు వీణామాలిక్‌కి కోర్టు ఈ శిక్ష విధించింది. వీణా మాలిక్‌తోపాటు ఆమె భర్త బషీర్, టెలివిజన్ యాంకర్ షకి ష్టా వాహిది, జియో టీవీ అధిపతి మీర్ షకీల్ ఉర్ రెహ్మాన్‌కి కూడా కోర్టు 26 సంవత్సరాల జైలు శిక్షని విధించింది. దైవాన్ని దూషించే కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు వీరందరూ క్షమాపణలు చెప్పారు. అయితే పాకిస్థాన్‌లోని అతివాదులు మాత్రం వీరికి కఠిన శిక్ష విధించాలని పట్టుబట్టారు. ఈ నలుగురికీ 26 సంవత్సరాల జైలుశిక్షతోపాటు పదమూడు లక్షల రూపాయల జరిమానా కోర్టు విధించింది. ఈ కేసులో ట్విస్ట్ ఏమిటంటే, శిక్ష పడిన ఈ నలుగురూ పాకిస్థాన్ నుంచి చాలా రోజుల క్రితమే ఎవరి దారిన వాళ్ళు పారిపోయారు. అతివాదులు తమమీద ఎక్కడ దాడిచేసి చంపేస్తారోనన్న భయంతో వీరు పాకిస్థాన్‌ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. హీరోయిన్ వీణా మాలిక్ ఇండియాలోనే ఉన్నట్టు తెలుస్తోంది.