జెనీలియాకి బుజ్జి బుడంకాయ్ పుట్టాడోచ్...

 

ఆమధ్య జెనీలియా ప్రెగ్నెంట్‌గా వుందంటూ కొన్ని ఫొటోలు విడుదలైన విషయం తెలిసిందే. అప్పుడు ఆ ఫొటోల మీద జెనీలియా, ఆమె భర్త బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయలేదు. దాంతో జెనీలియా తల్లి కాబోతోందని మీడియా డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు జెనీలియా నిజంగానే తల్లి అయింది. ఆమె మంగళవారం నాడు పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రితేష్ దేశ్‌ముఖ్ ట్విట్టర్ ద్వారా బయటి ప్రపంచానికి వెల్లడించాడు. Its a BBBOOOOYYYYYY అంటూ రితేష్ దేశ్‌ముఖ్ ట్విట్ చేశాడు. ఈ ట్విట్ చేసిన విధానమే అబ్బాయి పుట్టినందుకు రితేష్ ఎంత సంతోషిస్తున్నాడన్న విషయానికి అద్దం పడుతోంది. రితేష్ తండ్రి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేశ్‌‌ముఖ్ రెండేళ్ళ క్రిందట మరణించారు. ఇప్పుడు అబ్బాయి పుట్టడంతో తన తండ్రి తనకు పుట్టాడని రితేష్ సంతోషపడుతూ వుండొచ్చు. అలాగే తనకు నట వారసుడు దొరికాడని కూడా రితేష్ మురిసిపోతూ వుండొచ్చు. జెనీలియా నిండు చూలాలిగా వున్నప్పటికీ హైదరాబాద్‌లో జరిగిన సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పిత పెళ్ళికి వచ్చింది. ఆ సమాయంలో ఆమె కెమెరా కంటపడకుండా జాగ్రత్తలు తీసుకుంది. 2003 సంవత్సరంలో ‘తుఝే మేరీ కసమ్’ సినిమాలో కలసి నటించినప్పుడు రితేష్, జెనీలియా ప్రేమలో పడ్డారు. తొమ్మిది సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత 2012లో వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. రితేష్, జెనీలియా దంపతులకు కొడుకు పుట్టాడన్న విషయం తెలిసిన అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు ట్విట్లతో వీరికి అభినందనలు తెలియజేస్తున్నారు.