సమాజం పట్ల బాధ్యత లేని జగన్.. వాసిరెడ్డి పద్మ ఫైర్

రాష్ట్రంలో వైసీపీ అధాకారంలో ఉన్నంత కాలం తమంత వారు లేరన్నట్లుగా విర్రవీగిన నేతలు.. పార్టీ  అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ నుంచి ఒక్కరొక్కరుగా నేతలు వెళ్లిపోతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ భజన వినా మరేం లేనట్లుగా వ్యవహరించిన వారు కూడా ఇప్పుడు వైసీపీకో దండం.. జగన్ కు వంద దండాలు అన్నట్లుగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు.   ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఇలా వైసీపీకి గుడ్ బై చెప్పేసిన వారి సంఖ్య పెద్దగానే ఉంది. ఇప్పుడ తాజాగా తాజాగా మరో సీనియర్ మహిళా నేత, మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా వైసీపీకి రాజీనామా చేసేశారు.

ఆమె పార్టీ వీడటానికి పలు కారణాలున్నప్పటికీ, తాను ఆశించిన జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవి దక్కనందుకేనని ఆమె సన్నిహితులు అంటున్నారు.  జగన్ హయాంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ హోదా వెలగబెట్టిన వాసిరెడ్డి పద్మ.. జగన్ కళ్లల్లో ఆనందం చూడడానికి అన్నట్లు ఇష్టారీతిగా వ్యవహరించారు. ఏకంగా పవన్ కల్యాణ్ కే మహిళా కమిషన్ ముందు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. స్థాయిని మరిచి మరీ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. 

అయితే ఒక సారి జగన్ అధికారం కోల్పోయిన తరువాత  వాసిరెడ్డి పద్మ పెద్దగా ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు.  పార్టీ కార్యక్రమాల విషయంలో కూడా అంటీముట్టనట్టే ఉంటున్నారు. ఎన్నికలకు ముందు ఆమె మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. జగ్గయ్య పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించారు. ఆ టికెట్టు దక్కుతుందన్నధీమాతోనే మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు.

అయితే వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు ఆమెకు జగ్గయ్యపేట నుంచి పోటీ చేసే అవకాశాన్ని జగన్ ఇవ్వలేదు. అప్పటి నుంచీ వాసిరెడ్డి పద్మలో అసంతృప్తి పేరుకుపోయిందని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇక ఇప్పుడు జగ్గయ్య పేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదభాను పార్టీకి రాజీనామా చేసి జనసేన గూటికి చేరడంతో.. కనీసం నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవైనా దక్కుతుందని ఆశించిన వాసిరెడ్డి  పద్మ అది కూడా దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని, అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.    

గతంలో జగ్గయ్యపేట నుంచి పోటీ చేయడానికి టికెట్ దక్కక అసంతృప్తి చెంది మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవిని రాజీనామాతో వదులుకున్న సమయంలో జగన్ పై వీసమెత్తు విమర్శ కూడా చేయని పవాసిరెడ్డి పద్మ ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసే సమయంలో మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయం అంటే వ్యాపారం  కాదని జగన్ తెలుసుకోవాలని హితవు చెప్పారు. పార్టీని నడిపించడంలో జగన్‌కు బాధ్యత లేదని, పరిపాలన అంటే పెత్తనం కాదని జగన్ తెలుసుకోవాలని అన్నారు. అసలు జగన్ కు సమాజం పట్లే బాధ్యత లేదని దుయ్యబట్టారు.