దండుకోవడం, లాక్కోవడంలో జగన్ కు తన పర బేధం లేదు!?

మా ఇంటికొస్తే ఏం తెస్తావు.. మీ ఇంటికొస్తే ఏమిస్తావు అనే రకం జగన్. ఆయనకు తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియదు. అయితే ఆ తీసుకోవడం కూడా వాళ్లు ఇస్తే పుచ్చుకోవడంలా కాకుండా.. బలవంతంగా లాగేసుకోవడమంటే మరీ ఇష్టం. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నంత కాలం ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దండుకోవడం అన్న విషయంలో ఆరితేరిపోయిన జగన్ ఆ తరువాత తాను  ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా అదే పంథాలో సాగారు. అలా దండుకునే విషయంలో ఆయనకు తనాపరా బేధం ఉన్నట్లు కనిపించదు. అందుకే ఆస్తుల కోసం, షేర్ల కోసం తల్లి, చెల్లిపై కూడా కోర్టులో కేసులు వేశారు. 

ఇప్పడు ఒక పక్క జగన్ చెల్లి షర్మిలతో సయోధ్య కోసం తండ్రి ఆస్తులలో ఆమెకు రావలసిన వాటాను ఆమెకు ఇచ్చేందుకు సిద్ధపడ్డారనీ, ఈ మేరకు కర్నాటక ఉప ముఖ్యమంత్రి, వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు అయిన శివకుమార్ ద్వారా మధ్యవర్తిత్వం నెరిపారనీ, ఆస్తుల పంపకానికి డీల్ కూడా కుదిరిపోయినట్లేననీ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.  సరిగ్గా అదే సమయంలో  తల్లినీ, చెల్లినీ ఆస్తుల కోసం, షేర్ల కోసం జగన్ కోర్టుకు లాగారన్న విషయం వెలుగులోకి వచ్చింది. తాను పెట్టిన దాదాపు సూట్ కేస్ కంపెనీ లాంటి ఓ కంపెనీలో షేర్ల కోసం జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై కంపెనీ లా ట్రైబ్యునల్ లో కేసు వేశారు. జగ్ ఈ కేసు సెప్టెంబర్ లోనే వేసినా  ఆ విషయం బయటకు తెలియలేదు. ఇప్పుడు ఈ కేసు నవంబర్ లో విచారణకు రానున్న నేపథ్యంలో బయటపడింది.   

వైఎస్ అధికరారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి సరస్వతి పవర్ అనే కంపెనీని కాగితాలపై స్థాపించేసి పల్నాడులో ఆ కంపెనీ పేరు మీద కారు చౌకగా భూములు కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ కంపెనీలో తల్లి విజయమ్మ, కుమార్తె షర్మిలకు కొన్ని షేర్లు కేటాయించారు. ఇప్పుడు ఆ షేర్ల కోసమే జగన్ కంపెనీలా ట్రైబ్యునల్ లో తల్లి, చెల్లికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. తాను తల్లి విజయమ్మ కు కేటాయించిన షేర్లను ఆమె చెల్లి షర్మిలకు కేటాయించిందనీ, అలా కేటాయించడం అక్రమమనీ పేర్కొంటూ తన షేర్లు తనకు ఇచ్చేయాలంటూ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.  ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే జగన్ సహ పిటిషనర్ గా భారతి కూడా ఉన్నారు.  

ఈ కేసు విషయం వెలుగులోకి రావడంతో జగన్ షర్మిలతో చేస్తున్న రాయబేరాలు, ఆస్తిపంపకాలకు సిద్ధం అవ్వడం వెనుక కూడా ఏదైనా మతలబు ఉందా? కేవలం రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు, తనపై షర్మిల విమర్శల బాణాలు గుప్పించకుండా ఆపి.. ఆ సంధికాలంలో కాంగ్రెస్ తో డీల్ పూర్తి చేసుకునే ప్రణాళిక ఉందా అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద జగన్ తల్లి, చెల్లిపై షేర్ల కోసం ట్రైబ్యునల్ లో వేసిన పిటిషన్ జగన్ ప్రతిష్ఠను మరింత దిగజార్చింది. వైఎస్ మరణం నుంచి ఇప్పటి వరకూ జగన్ కు అండగా నిలుస్తూ వచ్చిన వైఎస్ అభిమానులు సైతం జగన్ పై  తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.