క్రికెట్‌లో సంచలనం... వైభవ్‌కు అరుదైన పురస్కారం

 

బిహార్‌కు చెందిన 14 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్‌కు ఇప్పుడు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం దక్కింది. ఈ పురస్కారాన్ని న్యూఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వైభవ్ స్వీకరించాడు. పురస్కార ప్రదానోత్సవం అనంతరం, వైభవ్‌తో పాటు ఇతర అవార్డు గ్రహీతలు ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా కలుసుకున్నారు. దేశ యువతలో ప్రేరణ నింపే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. క్రికెట్ రంగంలో అద్భుత ప్రతిభను కనబరిచినందుకుగాను ఈ పురస్కారం వైభవ్‌కు దక్కింది. చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అతడి కెరీర్‌లో ఓ చారిత్రక ఘట్టంగా నిలిచింది.

అవార్డు కార్యక్రమంలో పాల్గొనడం కారణంగా వైభవ్ విజయ్ హజారే ట్రోఫీ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. ఫీల్డ్‌లో ఆడే అవకాశం కోల్పోవడం ఏ ఆటగాడికైనా కష్టమే అయినా, దేశ స్థాయిలో గౌరవం అందుకోవడం జీవితంలో అరుదైన అవకాశం అని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లో వైభవ్ చేసిన ప్రదర్శనతో రికార్డులు బద్దలయ్యాయి. కేవలం 84 బంతుల్లో 190 పరుగులు చేసి, బిహార్‌ను భారీ స్కోర్ దిశగా నడిపించాడు.

 ఆ ఇన్నింగ్స్‌తో వైభవ్ దేశీయ క్రికెట్‌లో అత్యంత దూకుడు బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్న వయసులోనే పెద్ద రికార్డులు నెలకొల్పుతూ, భవిష్యత్ భారత క్రికెట్‌కు ఆశాజనకంగా మారాడు. సీనియర్ జట్టులోకి కూడా వైభవ్‌ను తీసుకోవాలనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అనేది 5 నుంచి 18 ఏళ్ల పిల్లలకు ఇచ్చే భారతదేశ అత్యున్నత పౌర గౌరవం. సాహసం, కళ - సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజి, సామాజిక సేవ, క్రీడల్లో ప్రతిభ చూపిన బాలలకు ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu