ఉత్తరాయణ విశిష్టత!! 

సంవత్సరాన్ని ఆరు ఋతువులు, పన్నెండు మాసాలుగా విభిజించినట్టు అందరికీ తెలుసు. అయితే ఉత్తరాయణం, దక్షిణాయణం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ కొంతమంది కూడా తెలుగు సంవత్సరాన్ని చక్కగా తెలుసుకుని, దాన్ని పాటించేవాళ్లకే అర్థమవుతుంది. సాధారణంగా మహావిష్ణువు దక్షిణాయణంలో నిద్రపోయి, ఉత్తరాయణంలో నిద్ర నుండి మేల్కొంటాడని, అందుకే ముక్కోటి ఏకాదశి రోజున పెద్ద ఎత్తున భక్తులు  దర్శనానికి వెళ్తారు.ఇక శాస్త్ర పరంగా చూస్తే సూర్యుడు దక్షిణదిక్కుకు దగ్గరలో ఆరు నెలల పాటు, ఉత్తర దిక్కుకు  ఆరు నెలల పాటు ప్రయాణిస్తాడు. ఇదంతా భూమద్యరేఖ, అక్షాoశ, రేఖాoశాల వల్ల కలిగే మార్పుగా అర్ధం చేసుకోవచ్చు. ఉత్తరాయణం తెలుగు సంవత్సర ప్రకారం పుష్యమాసంలో మొదలై ఆషాడ మాసంలో ముగుస్తుంది. ఈ ప్రారంభం పగటి సమయం తక్కువగా ఉండి, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది కారణం  సూర్యుడు ఉత్తర దిక్కు వైపు ఉండటం వల్ల భూమండలానికి దూరంగా ఉంటాడు.

నమ్మకం!!

చాలామంది ఉత్తరాయణంలో చనిపోయేవాళ్లకు మళ్ళీ జన్మ ఉండదని, దేవుడు కృపకు పాత్రులయ్యి ఆ దేవుడి సమక్షాన్ని చేరుకుంటారని చెబుతారు. అదే దక్షిణాయణంలో మరణించేవారు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ, కర్మలు చేస్తూ, ఆ కర్మల తాలూకూ ఫలితాలను అనుభవిస్తారని చెబుతారు. అయితే గీతలో కృష్ణుడు చెప్పే విషయం ఒకటుంది.

వెలుగు- చీకటి, జ్ఞానం-అజ్ఞానం!!

ఉత్తరాయణ ప్రారంభం కాసింత చీకటి కాలం ఎక్కువే ఉన్నా క్రమంగా అది తగ్గి వెలుగు పరుచుకుంటూ ఉంటుంది. ఈ వెలుగు అనేది మనిషి జ్ఞానానికి ప్రతీక కాబట్టి ఈ ఉత్తరాయణ కాలాన్ని జ్ఞానవంతమైన కాలంగా పేర్కొంటారు తప్ప వెలుగున్న కాలంలో చస్తే మోక్షం తక్కుతుందని అర్థం కాదు. జ్ఞాని అయిన మనిషి మంచి, చెడు విచక్షణ వంటివి కలిగి ఉంటాడు. ఆలోచనా పరిజ్ఞానం ఎక్కువ ఉంటుంది జ్ఞానిలో. అంటే ఉత్తరాయణం జ్ఞానిని తెలిపితే, దక్షిణాయణం అజ్ఞానిని సూచిస్తుంది. అంటే జ్ఞానిగా మరణించేవాడు ఉత్తమ గతులు పొందుతాడు అని అర్థం.

దేవదేవతా నమామ్యహం!!

భారతీయ హిందూ సంప్రదాయంలో దేవుళ్ళ ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. భక్తులు ఎన్నో విధాలుగా దేవతలను సేవిస్తారు. పూజలు, వ్రతాలు, నోములు, దీక్షలు ఇలా ఎన్నో దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి చేస్తారు. అయితే మనుషులకు పగలు, రాత్రి ఎలాగో,దేవుళ్ళకు ఉత్తరాయణం, దక్షిణాయణం అలాంటివేనని కాబట్టి ఉత్తరాయణంలో దేవతలు మెలకువగా ఉంటారని పండితులు చెబుతారు. అంటే ఈ ఉత్తరాయణంలో చేసే పూజలు, వ్రతాలు ఎంతో గొప్ప పలితాన్ని ఇస్తాయనమాట. అందుకే ఈ కాలంలో కోర్కెల నిమిత్తం తలపెట్టే దైవ కార్యాలకు పలితాలు తొందరగా లభిస్తాయని కూడా నమ్ముతారు.

ఇకపోతే చీకటి కాలం నుండి వెలుగులోకి సూర్యుడు పయనం అవ్వడం ఇక్కడి ప్రత్యేకత. అదే మకర సంక్రాంతిగా తెలుగువారి పెద్ద పండుగగా చాలా గొప్పగా నిర్వహించుకుంటారు.

పంటలు పండి ధాన్యం ఇంటికి చేరి, అవి అమ్మగా చేతులకు డబ్బులొచ్చి రైతులు అందరూ ఎంతో సంతోషంగా ఉండటం దేశానికి మంచిది. రైతు సంతోషంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇలా ఉత్తరాయణ ప్రారంభమే ఓ గొప్ప ఆశతో మొదలవుతుంది కాబట్టి ఈ ఉత్తరాయణం శాస్త్రపరంగానూ, ఆధ్యాత్మిక పరంగానూ అందరికీ మంచి చేయాలని కోరుకుందాం.

◆ వెంకటేష్ పువ్వాడ