పంచభూతాల ఆకలి తీర్చాలి!! 

ఈ ప్రపంచాన్ని నిలబెడుతున్నవి ఏవి అంటే పంచభూతాలే. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఇవన్నీ అద్భుతాలు. హేతువాదులు భూతం లేదు వాతం లేదు అని కొట్టి పడేసినా వాటిని సైన్స్ పరంగానూ, సోషల్ పరంగానూ ఆవరణాలు, భౌతిక రసాయన కేంద్రకాలు అని మాట్లాడినా మొత్తం మీద ప్రపంచాన్ని రక్షిస్తున్నవి అవే.

అయితే మనిషి తన స్వార్థంతో వీటిని అంతకంతకూ అదుపులో పెట్టాలని, అణచాలని చూస్తున్నాడు. కానీ అది ఎంత తప్పో అపుడపుడు ప్రకృతీ వైఫరిత్యాల ద్వారా అర్థమవుతూనే ఉన్నా చీమ కుట్టినట్టు కూడా అనిపించదు మనిషికి.

చెట్లను నరికేస్తాడు, పచ్చదనాన్ని అనిచేస్తాడు, ప్రవాహలను అడ్డుకుని ప్రాజెక్టులు కడతారు, నీటిని, గాలిని కాలుష్యం చేస్తాడు. ఇట్లా మనిషి తన పరిధిలో ఉన్న ప్రతి దాన్ని అడ్డుకుంటూ ఆ ప్రకృతిని కూడా శాసించాలని చూస్తున్నాడు.

ఈ పంచభూతాలకు ప్రకృతి అని, దాన్ని కూడా ఒక దేవతగా భావించి పూజించే ప్రత్యేకత మన భారతదేశానిది. అయితే క్రమంగా పాశ్చాత్య దేశాల ప్రభావం మన దేశ పౌరులపై పడి ఆ ప్రకృతిని హింసిస్తున్నాడు మనిషి.

చెట్లు ఆరోగ్యానికి మెట్లు.

చెట్లు నాటడం అంటే గొప్ప యజ్ఞం చేయడం. మొక్క నాటి సంరక్షించి దాన్ని పెంచి పెద్ద చేస్తే వంద యజ్ఞాలు పూర్తి చేసినంత పుణ్యం వస్తుంది. అది ప్రకృతికి సేవ చేసినట్టే అవుతుంది. ఆ ప్రకృతి ఆకలి తీర్చినట్టే అవుతుంది.

భూమి తాపం తీర్చాలి!!

ఎక్కడ చూసినా సిమెంట్ తో కప్పబడిన రహదారులే. ఇంటి ముంగిలి నుండి, రహదారులు పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇళ్లలో కూడా చలువరాతి బండలు పరిచి ఉంటాము. ఇంకా ఒకదాని మీద మరొకటి అంతస్థుల మీద అంతస్తులు అవన్నీ కలసి మనిషి మనుగడకు ఎంత సమస్య తెచ్చిపెడుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. మనిషి పుట్టాక జీవితకాలంలో ఎలా మార్పులు చెందుతూ ఉంటాడో అలాంటిదే ఈ భూమి విషయంలో కూడా జరుగుతుంది. అయితే మనిషి ఎన్ని దశలు మారినా శరీరానికి తగిన పోషణ ఇవ్వడం మాత్రం మానుకోడు. మరి భూమి విషయంలో ఎవరూ ఆలోచించరేం. ఒకప్పుడు ఎక్కడ చూసినా మట్టి నేల. వర్షం పడితే ధారగా భూగర్భంలోకి చొచ్చుకుపోయే నీళ్లుఇప్పుడు కాంక్రీటు రోడ్ ల మీద ప్రవహించి చివరికి ఏ మురికి కాలువలోనో కలసిపోతున్నాయి.

పలితంగా భూమిలోపల విపరీతంగా వేడి పెరిపోయి అది భూకంపాలకు, భూమి నిస్సారతకు కారణం అవుతోంది.

జలకాలుష్యం, వాయు కాలుష్యం!

ఇవి రెండూ తలచుకుంటే  బాబోయ్ అనిపిస్తుంది. ఒకప్పుడు నదీ జలాలకు ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, పుష్కరాలు జరుపుతూ ఉంటే అదంతా ప్రకృతీ ఆరాధనలో భాగంగా ఉండేది. అయితే ఫ్యాక్టరీలు ఏర్పడ్డాక వాటి వ్యర్థాలు నీళ్లలోకి వదులుతూ జలకాలుష్యం బాగా పెరిగిపోయింది. కానీ మూర్ఖుల వాదన ఎలా ఉంటుంది అంటే నదీజలాల ప్రత్యేక పూజలు వల్లే జలకాలుష్యం జరుగుతోందని వాదిస్తారు. అంతేనా ప్రకృతిని ఆరాధించడం మూర్ఖత్వం అని కూడా అంటారు. 

మన భారతీయులకు ప్రతిభ లేదు, వారు కనిపెడుతున్న అన్ని రకాల యంత్రాల సహయంతోనే నేడు మనిషి ఎంతో సంతోషంగా ఉంటున్నాడు అని గొంతు అరచి చెప్పే నాస్తిక, మూర్ఖత్వ వాదులకు ఆ యంత్రాల వల్ల వెలువడుతున్న పొగే వాయు కాలుష్యానికి మూలమని తెలియదు ఎందుకో!!

ఒకప్పటి మహర్షుల నుండి ఇప్పుడు కూడా అక్కడక్కడా  జరుగుతున్న యజ్ఞాలు, యాగాలు, హోమాలు వంటివి వాయు కాలుష్యాన్ని శుద్ధి చేయడానికి ఎంతో గొప్పగా దోహదపడతాయని అందరూ వాదించే సైన్స్ పరంగానే ఆధారాలు లభ్యమవుతున్నా మనుషులు మాత్రం తమ పద్దతి మార్చుకోరు. పద్దతిగా  ఉండేవాళ్లను ఉండనివ్వరు.

ఇప్పుడేం చెయ్యాలని సందేహమా!!

పర్యావరణాన్ని కాపాడుకోవాలి. పంచభూతాల ఆకలి తీర్చాలి. నీటిని శుద్ధి చేస్తూ వాతావరణాన్ని మార్చుకోవాలి. కాలుష్యాన్ని నివారించాలి. భూమి తాపాన్ని తగ్గించాలి. నదులు సముద్రాలు పిల్ల కాలువలు వీటిని కలుషితం చేయకూడదు. ఇన్ని సంవత్సరాల నుండి మనిషి ప్రకృతిని ఇష్టమొచ్చినట్టు వాడుతూ గందరగోళం చేసాడు కాబట్టి ఇప్పుడు ప్రకృతికి రుణాన్ని తిరిగిచ్చేయాలి. ప్రకృతిని పసిపాపలా చూసుకోవాలి.

◆ వెంకటేష్ పువ్వాడ