సజీవంగా పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్
posted on Aug 5, 2015 8:18PM

బుదవారం ఉదయం జమ్మూలో ఉదంపూర్ జిల్లాలో భారత సరిహద్దు భద్రతా దళాల మీద దాడి చేసిన ఒక ఉగ్రవాది భద్రతా దళాల కాల్పులలో అక్కడికక్కడే మరణించాడు. ఉస్మాన్ ఖాన్ అనే మరో ఉగ్రవాది తప్పించుకొని పారిపోవాలని చూసినప్పటికీ భద్రతా దళాలకు సజీవంగా చిక్కాడు. అతనిని పట్టుకొన్నప్పుడు అక్కడే ఉన్న మీడియా అడిగిన ప్రశ్నలకు అతను చెప్పిన జవాబులు అందరినీ నివ్వెరపోయేలా చేశాయి.
“నేను పాకిస్తాన్ నుండి హిందువులను చంపేందుకే దట్టమయిన అడవుల గుండా ప్రయాణించి ఇక్కడికి వచ్చాము. 12రోజుల క్రితమే నేను ఇక్కడికి చేరుకొన్నాను. నేను తెచ్చుకొన్న ఆహారం మూడు రోజుల క్రితమే అయిపోయింది. నిన్నటి నుండి ఆహారం లేకుండా తిరుగుతున్నాను. మేమిద్దరం చేసిన దాడిలో నా పార్టనర్ భారత జవాన్ల చేతిలో మరణించాడు. ఒకవేళ నేను కూడా మరణించి ఉండి ఉంటే అది అల్లా నిర్ణయంగా భావించేవాడిని. కానీ ఇదంతా చాలా వినోదంగా ఉంది.” అని చెప్పాడు. మీడియా అతనిని ప్రశ్నించినప్పుడు తను లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తినని చెప్పుకొన్నాడు మొదట అతను తన వయసు 20 సం.లని చెప్పాడు. కానీ మరికొద్దిసేపటి తరువాత అతను తన వయసు 16సం.లని మాట మార్చాడు.
భారత్ లో ప్రవేశించే పాక్ ఉగ్రవాదులు ఒకవేళ భద్రతా దళాలకు పట్టుబడినట్లయితే తమ వయసు 16సం.లని చెప్పవలసిందిగా లష్కర్ సంస్థ ప్రత్యేకంగా చెప్పి పంపిస్తుందని అజ్మల్ కసాబ్ విషయంలో ఇదివరకే రుజువయింది. ఆవిధంగా చెపిత భారత చట్టాల ప్రకారం అతనిని బాల నేరస్తుడిగా పరిగణించి చిన్నపాటి శిక్షతో విడిచిపెట్టే అవకాశం ఉంటుందని ఉగ్రవాదుల విశ్వాసం. ముంబై దాడుల్లో సజీవంగా పట్టుబడ్డ ఉగ్రవాది అజ్మల్ కసాబ్ కూడా తన వయసును తక్కువ చేసి చెప్పడం వలన, అతని వయసును నిర్ధారించుకొనేందుకు భారత ప్రభుత్వం చాలా శ్రమ పడవలసి వచ్చింది. ఆ కారణంగానే అతను ఉరి శిక్ష పడకుండా చాలా ఏళ్ళు తప్పించుకోగలిగాడు. అందుకే ఇప్పుడు పట్టుబడ్డ ఉస్మాన్ ఖాన్ కూడా తన వయసు కేవలం 16సం.లే అని తక్కువ చేసి చెప్పుకొన్నాడు.
అతనిని సజీవంగా పట్టుకోవడం వలన అతని ద్వారా ఉగ్రవాదుల కుట్రల గురించి చాలా కీలకమయిన రహస్యాలు తెలుసుకొనే అవకాశం ఉంది. కానీ అతనిని దోషి అని నిరూపించి ఉరి కంభం ఎక్కించేందుకు చాలా ఏళ్ళ సమయం పడుతుంది. అంతే కాదు ఆ ప్రక్రియలో భారత ప్రభుత్వానికి అనేక కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది. అజ్మల్ కసాబ్ ని పట్టుకొన్నప్పతి నుండి అతనిని ఉరి తీసే వరకు అతని రక్షణ, ఆరోగ్యం, కోర్టు కేసు నడిపించడానికి, అతనికి వ్యతిరేకంగా శాఖ్యాలను సేకరించడానికి, అతని వయసు, ప్రాంతం వగైరా నిర్ధారణకి భారతప్రభుత్వం సుమారు రూ.100 కోట్లు పైనే ఖర్చు చేయవలసి వచ్చిందని వార్తలు వచ్చాయి. కనుక ఇప్పుడు ఈ ఉస్మాన్ ఖాన్ కోసం మరో రూ.100 కోట్లు సిద్దంగా ఉంచుకోవాలేమో?