బీజేపీ నష్ట నివారణ చర్యలు.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అబ్బాస్ నఖ్వీ?

నూపుర్‌ శర్మ వ్యాఖ్యల ద్వారా ఇస్లామిక్‌ దేశాల్లో, దేశంలోని ముస్లింలలో చెలరేగిన అసంతృప్తిని, ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీజేపీ నడుంబిగించింది.. ముస్లింల ఆగ్రహాన్ని తగ్గించేందుకు ముఖ్తార్ అబ్బాస్ నక్విని ఎన్డీయే ఉపరాష్ట్ర అభ్యర్థిగా ప్రకటించనుంది. నక్వీని ఉపరాష్ట్రపతిని చేయడం ద్వారా ముస్లింలలో రగులుతున్న అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు చల్లారుతాయి అని బీజేపీ భావిస్తున్నది.  

నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రి నక్వీ రాజ్యసభ సభ్యత్వం గురువారంతో ముగుస్తున్న నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి బుధవారమే రాజీనామా చేశారు. రాజీనామాకు ముందు ఆయన బీజేపీ జాీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ ఉభయ సభల్లో ఆరునెలలలోగా సభ్యడిగా లేకుంటే మంత్రిగా కొనసాగకూడదన్న నిబంధన మేరకే నక్వీ రాజీనామా చేశారని చెబుతున్నా.. ఆయనను దేశంలోని రెండో అత్యున్నత రాజ్యాంగ పదవికి పంపే  ఉద్దేశంతోనే  బీజేపీ ఆయనను  మళ్లీ రాజ్యసభకు పంపలేదని పరిశీలకులు అంటున్నారు.

అలాగే గతంలో ఆయన  ప్రాతినిధ్యం వహించిన రాంపూర్‌  లోక్‌సభ నియోజకవర్గానికి ఇటీవల ఉప ఎన్నిక లు జరిగినప్పటికీ ఆయనను అక్కడ పోటీకి దింపలేదు. వీటన్నిటినీ బట్టి చూస్తే నక్వీని ఉపరాష్ట్రపతిని చేయాలని బీజేపీ నిర్ణయించుకుందని చెబుతున్నారు. నుపుర్ వ్యాఖ్యల వల్ల కేంద్రంలోని ముస్లింలలో మోడీ సర్కార్ పై గూడుకట్టుకున్న వ్యతిరేకతను, అలాగే ప్రభుత్వంపై ఉన్న ముస్లిం వ్యతిరేక ముద్రను  నక్వీని ఉపరాష్ట్రపతిగా నియమించడం  తొలగించుకోవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అంతే కాకుండా ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించిన రెండు అంశాలు పౌరసత్వ సవరణ బిల్లు, ట్రిపుల్‌ తలాక్‌ అంశాల్లో నక్వీ మోడీ సర్కార్ కు అనుకూలంగా నిలిచారు. వాటిని సమర్ధించారు. దీంతో విధేయత పరంగా చూసినా కూడా నక్వీ  ఉపరాష్ట్రపతిగా పంపించడానికే బీజేపీ మొగ్గు చూపుతుందని అంటున్నారు.