75 మందితో టీటీడీ కొత్త పాలక మండలి!
posted on Sep 15, 2021 9:22AM
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి ఖరారైందని తెలుస్తోంది. మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే టీటీడీ పాలకమండలిని ఖరారు చేశారని సమాచారం. ఈసారి 75 మందితో పాలకమండలి కొలువు దీరబోతోందని తెలుస్తోంది. ఇందులో 25 మంది టీటీడీ బోర్డు మెంబర్లు కాగా.. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 50 మందిని నియమించనున్నారు. టీటీడీ కొత్త పాలక మండలిపై ఒకటి, రెండు రోజుల్లోనే జీవో వచ్చే అవకాశం ఉంది.
టీటీడీ నిబంధనల మేరకు ఛైర్మన్ తో సహా 25 మంది సభ్యులతో పాలక మండలి ఉండాలి. అయితే కేంద్రంలోని పెద్దల మొదలు పలు పార్టీలు..అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రలు మొదలు అనేక మంది ప్రముఖులు తమ వారిని ఈ బోర్డులో అవకాశం కల్పించాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు సిఫార్సు చేశారు. వారిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలు..తమిళనాడు సీఎం వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఊహించని స్థాయిలో వచ్చిన సిఫార్సులు.. ఒత్తిడి కారణంగా భారీ స్థాయిలో ఆశావాహులు ఉండటంతో ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. అందులో భాగంగా నిబంధనల ప్రకారం 25 మందితో బోర్డు సభ్యులు..మరో 50 మందిని టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించాలని నిర్ణయం తీసుకుంది.
25 మంది టీటీడీ బోర్డు మెంబర్లలో సుమారు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. ప్రతి బోర్డులోనూ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అవకాశం కల్పిస్తారు. ఈసారి తెలంగాణ రాష్ట్రం నుంచి ఐదుగురికి అవకాశం దక్కిందని అంటున్నారు. తమిళనాడు, కర్ణాటక నుండి కూడ ముగ్గురు చొప్పున.. ఢిల్లి నుండి ఒక మంత్రి గారి భార్యకు చోటు దక్కిందని సమాచారం. ఇక కేంద్రం పెద్దలు చెప్పిన మరొక నలుగురికి టీటీడీ బోర్డులో స్థానం దక్కిందని తెలుస్తోంది. గుజరాత్ రాష్ట్రం నుంచి ఒకరికి ఛాన్స్ దక్కిందనే ప్రచారం జరుగుతోంది. శారద పీఠం స్వామి చెప్పిన ఇద్దరు ఉండనున్నారు.
గత పాలక మండలిలో సభ్యులుగా ఉన్న సుధా నారయణ మూర్తి, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్, జూపల్లి రామేశ్వరరావు, తెలంగాణ నుంచి ప్రతాప రెడ్డి కి అవకాశం ఖాయమని తెలుస్తోంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం నుంచి ఒకరికి ఈ పాలక మండలిలో స్థానం ఖాయం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సారి గుజరాత్ కు చెందిన ఒకరికి సైతం బోర్డు సభ్యుడుగా నియమితులు అవ్వనున్నట్లుగా తెలుస్తోంది. పలువురు కేంద్ర మంత్రులు ఒక్కక్కరూ పలువురి పేర్లు సిఫార్సు చేసారు. సినీ పరిశ్రమ నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా విశ్వసనీయ సమాచారం.
గత పాలక మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు భూమన కరుణాకర రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఈ సారి సైతం అదే హోదాలో కొనసాగనున్నారు. తిరుపతి స్థానిక ఎమ్మెల్యేగా భూమన..తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డికి ఈ అవకాశం దక్కనుంది. అదే విధంగా బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉన్న విశాఖకు చెందిన సుధాకర్ సైతం ఈ సారి ఎక్స్ అఫీషియో కోటాలో బోర్డు సభ్యుడుగా ఉండనున్నారు.