ట్రబుల్ షూటరా.. క్రియేటరా?.. హరీష్ పై టీఆర్ఎస్ లో రచ్చ... 

‘ఇంకా రెండున్నరేళ్లు మేమే ఉంటాం.. ఎండమావిలాంటి బీజేపీ వైపు వెళ్లేబదులు. అధికారంలో ఉన్న మాకు మద్ధతునీయండి’ హుజూరాబాద్ ఉప ఎన్నిక పద్మవ్యూహంలో చిక్కుకున్న మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్య ఇది. ఆయన ఏ ఉద్దేశంతో, ఎలాంటి మూడ్’లో ఉండి ఈ వ్యాఖ్య చేశారో ఏమో గానీ,  రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా తెరాస వర్గాల్లో హరీష్ వ్యాఖ్యపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో జోరుగా తిరుగుతున్న హరీష్ రావు.. ఒక కులసమావేశంలో చేసిన ఈ వ్యాఖ్య ఏమి సూచిస్తోంది? ఆయన మాటల అర్థం ఏమిటి? పార్టీనాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.  

ఇది అభ్యర్ధన, ప్రార్ధన, కాళ్ళ బేరమా లేక బెదిరింపా? అని పార్టీ క్యాడరే విస్మయాన్ని వ్యక్తపరుస్తోంది. ఇదొకటే కాదు, హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో హరీష్ రావు మాటల తీరు, చేస్తున్న వ్యాఖ్యలు వింటుంటే, చదవేస్తే ఉన్నమతి పోయింద్నన సామెత గుర్తుకోస్తోందని, కారు పార్టీలోనే కొందరు నేతలు గుసగుసలు పోతున్నారు. అంతే కాదు, ప్రచారం పేరుతో పార్టీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా, అన్న సందేహలు కూడా అక్కడక్కడ మొదలయ్యాయి. ముఖ్యంగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,  మంత్రి కేటీఆర్, ఉప ఎన్నికని లైట్ గా తెస్సుకోవాలని, అనవసర ప్రాధాన్యత వద్దని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా హరీష్ రావు, స్థాయి మరిచి చేస్తున్న వ్యాఖ్యలతో పార్టీని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారనే మాట కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది. 

ప్రతిపక్ష పార్టీలకు ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందని, హరీష్ చెప్పదలచుకున్నారా? ఇంతకాలంగా విపక్షాలు చేస్తున్న విమర్శను హరీష్ రావు నిజం చేయాలనుకుంటున్నారా లేక మాజీ దోస్తుకు మేలు చేసేందుకు ఉద్దేసపుర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, అని గులాబీ గూటిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.  అదే నిజం అయితే, లోక్ సభ ఎన్నికల్లో, తెరాసకు ఓటేయమని ఎలా అడుగుతాం... కేంద్రంలో ఎప్పటికైనా జాతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయి తప్ప ప్రాంతీయ పార్టీలు రావు కదా, మరి అలాంటప్పుడు లోక్ సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు పోటీ చేయడం ఎందుకు,  అవసరం లేదంటే... అంటూ ప్రశ్నిస్తున్నారు. 

హరీష్ రావు, ప్రతి ఊర్లో, ప్రతి ఉపన్యాసంలో ఈటల రాజేందర్ నియోజక వర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, అభివృద్ధిని పట్టించుకోలేదని చేస్తున్న ఆరోపణల విషయంలో కూడా ఇదే విధమైనా సందేహలు వ్యక్తమవుతున్నాయి. నియోజక వర్గానిక, ముఖ్యమంత్రి డబల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసినా, ఈటల ఒక్క ఇల్లు కూడా కట్టలేదని అనడం హాస్యాస్పదంగా ఉన్నదని, అధికార పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారు.  నిధులు విడుదల చేయకుండా ఇళ్లు మంజూరు చేసి ప్రయోజనం  ఏముంటుందని, రాష్ట్రంలో వీఐపీ, వీవీఐపీ నియోజక వవర్గాలు తప్పించి చాలా వరకు నియోజక వర్గాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ దుస్థితి ఒకేలా ఉందని, అంటున్నారు. అందుకే అభివృద్ధి, డబుల్ బెడ రూమ్ హౌసెస్ విషయంలో హరీష్ రావు ఈటల పై చేస్తున్న విమర్శ కూడా బ్రూమ్రాంగ్ అవుతుందని తెరాస నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. ఒక వేలు అటు చూపిస్తే నాలుగు వేళ్ళు మన వైపు చూపుతాయని అంటున్నారు. ఈటల నిన్నటిదాకా తెరాసలోనే ఉన్నారని, తెరాస ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారని మరిచిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తెరాస ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల ఏమీ చేయక పోతే అది ప్రభుత్వ వైఫల్యం, ముఖ్యమంత్రి వైఫల్యం కాదా, అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు హరీష్ రావు ట్రబుల్ షూటరా? ట్రబుల్ క్రియేటారా? అన్న సందేహలు కూడా వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.