మావోయిస్టుల నుంచి ముప్పు.. చంద్రబాబు భద్రతలోకి కౌంటర్ యాక్షన్ టీం
posted on Jan 8, 2025 1:44PM
మావోయిస్టుల నుంచి ముప్పు ఉందన్న సమాచారం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడికి భద్రత పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జడ్ ప్లస్ క్యాటగరి భద్రత ఉన్న చంద్రబాబు సెక్యూరిటీలోకి కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు వచ్చి చేరాయి.
ఈ అదనపు భద్రత ఆయన కుప్పం పర్యటన నుంచి అమలులోకి వచ్చింది. ఆయన భద్రత కోసం ఇప్పటికే ఉన్న ఎన్ఎస్ జీ, ఎస్ఎస్ జీతో పాటు ఆరుగురు కమెండోలతో కూడిన కౌంటర్ యాక్షన్ బృందాన్ని చేర్చారు. వీరికి స్థానిక సాయుధ బలగాలు అదనం. దేశంలో బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్న అతికొద్ది మంది వ్యక్తుల్లో చంద్రబాబు ఒకరు. తిరుపతిలోని అలిపిరి వద్ద ఆయనపై నక్సలైట్లు క్లెమోర్ మైన్లతో దాడి చేసిన అనంతరం ఆయనకు కేంద్రం జడ్ ప్లస్ భద్రత ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా మావోల నుంచి ముప్పు ఉందన్న ఇంటెలిజెన్స్ ఇన్ పుట్స్ తో భద్రతను పెంచారు. చంద్రబాబుకు మూడంచెల భద్రత ఉంటుంది. చంద్రబాబు మొదటి అంచెలో న్‌ఎస్‌జీ , రెండో అంచలో ఎస్‌ఎస్‌జీ ఉంటాయి. మూడో అంచెలో ఆరుగురు కమెండోలతో కూడిన యాక్షిన్ టీం ఉంటుంది. తొలి రెండు అంచెలలో ఉన్న భద్రతా సిబ్బంది.. చంద్రబాబుపై దాడి జరిగితే ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలిస్తారు. మూడో అంచలో ఉన్న కౌంటర్ యాక్షన్ టీ దాడికి వచ్చిన వారిపై ఎదురుదాడికి దిగుతారు. కుప్పం పర్యటన నుంచి అధికారికంగా కౌంటర్ యాక్షన్ టీం ను ముఖ్యమంత్రి భద్రతలో చేర్చారు.