ట్రంప్ వైట్ హౌజ్ లోకి వస్తే... ఇండియన్స్ కి బ్లాక్ డేసే!
posted on Dec 19, 2016 11:21AM
.jpg)
ట్రంప్ వచ్చాక భారతీయులకి కష్టమే! ఈ మాట అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు బాగా వినిపించేది. అందుక్కారణం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవిదేశీయుల్ని ఇంటికి పంపించి.. అమెరికన్స్ కి ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని ఆయన ప్రకటించటమే. అందుకు మార్గంగా ట్రంప్ హెచ్ 1బీ వీసాల జారీని కఠినతరం చేస్తానని కూడా చెప్పాడు. ఇప్పుడు అన్నంత పనీ చేస్తాడని బిక్కుబిక్కుమంటున్నారు లక్షలాది ఇండియన్స్! హిల్లరీ గెలిస్తే బావుండేదేమో అని వాపోతున్నారు!
ట్రంప్ ముస్లిమ్స్ ని పొలిటికల్ గా టార్గెట్ చేస్తే ఇండియన్స్, చైనీస్, మెక్సికన్స్ ని ఉద్యోగాల పరంగా టార్గెట్ చేశాడు ఎలక్షన్స్ కి ముందు. మరీ ముఖ్యంగా, ఐటీ రంగంలో మన ఇండియన్స్ ప్రతీ సంవత్సరం లక్షల మంది వెళ్లిపోతున్నారు డాలర్స్ దేశానికి! అక్కడ స్థానికుల కంటే మనోళ్లు తక్కువ ధరకు పని చేసి నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. వాళ్ల మీద ఆధారపడ్డ ఇండియాలోని కుటుంబాలు కూడా ఫుల్ హ్యాపీ! మా వాళ్లు అమెరికాలో వున్నారని గర్వంగా చెప్పుకునే వారు. కాని, ఇప్పుడు అలాంటి ఎన్నారై ఐటీ ప్రొఫెషనల్స్ కి అందరికీ కష్ట కాలం వచ్చినట్టే కనిపిస్తోంది. కొత్త వారు వళ్లటం, పాత వారు అమెరికాలోనే కొనసాగటం ఏది జరగాలన్నా వీసాలు ముఖ్యం. కాని, ట్రంప్ మన వారు అక్కడ ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించే హెచ్ 1బీ వీసాల జారీ కఠినతరం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే భారతీయులకి మరీ ముఖ్యంగా తెలుగు వారికి లక్షల ఉద్యోగాలు పోయినట్టే లెక్క! ఎందుకంటే, దేశంలోనే అత్యధిక మందిని అమెరికాకి పంపే రెండో సిటీ హైద్రాబాద్. ఇక్కడి నుంచి అమెరికాకి వేలాది మంది పరుగులు తీస్తుంటారు. వాళ్లందరికీ అమాంతం డాలర్ డ్రీమ్స్ చెదిరిపోయినట్టే!
ఎన్నికల ముందు అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ మన మోదీని కాపీ చేసి గాలం వేసిన ట్రంప్ ఇప్పుడు మన ఉద్యోగాలకే ఎందుకు ఎసరు పెడుతున్నాడు? దీనికి జవాబు కూడా ఎన్నికల ముందే ఆయన ఇచ్చేశాడు. మన వాళ్లు లక్షల్లో వెళ్లిపోయి ఉద్యోగాలు చేసేస్తుండటంతో స్థానిక అమెరికన్లకి జాబ్స్ దక్కటం లేదు. ఎప్పుడూ లేనిది అమెరికన్స్ కి కూడా నిరుద్యోగ సమస్య ఎలా వుంటుందో తెలిసి వస్తోంది. అందుకే, ముందు తమ వారికి ఉద్యోగం ఇచ్చాకే విదేశీయులకి ఇవ్వాలని ట్రంప్ అంటున్నాడు. అమెరికన్ యాంగిల్ నుంచి చూస్తే ఇది కరెక్టే కాని.. మన ఎన్నారై ఇండియన్ ఓట్స్ తెలివిగా రాబట్టుకుని గెలిచిన ట్రంప్ ఇప్పుడు మనకే నష్టం చేయటం... కొంచెం బాధాకరమే! కాని, ఇండియన్స్ పెంచుకున్న అమెరికన్ డాలర్ డ్రీమ్స్ కి మాత్రం ఇది రైట్ టైం కాదు..