పవన్ దెబ్బకి, వాడిపోతోన్న పువ్వు పార్టీ అభిమానుల ముఖాలు!
posted on Dec 19, 2016 10:27AM
.jpg)
పవన్ కళ్యాణ్ ట్విట్టర్ పోరాటం వాడిగా వేడిగా నడుస్తోంది! ఆయన విమర్శలు ముఖ్యంగా బీజేపి అభిమానుల్ని, మోదీ భక్తుల్ని చాలా డిస్టబ్ చేస్తున్నాయి. అందుకే, సోషల్ మీడియాలో పవర్ స్టార్ పై ఎదురు దాడి మొదలైంది. ఆయన గోవధ గురించి మాట్లాడితే... అది ఎప్పుడో పాచిపోయిన అంశం, దాన్ని ఇప్పుడెందుకు అనవసరంగా తిరగదోడుతున్నాడని అంటున్నారు. ఇక రోహిత్ వేముల ఆత్మహత్య గురించి మాట్లాడితే.. టీడీపికి ఇబ్బంది కలిగించే రిషితేశ్వరి ఉదంతం ఎందుకు మాట్లాడడని నిలదీస్తున్నారు. జాతీయ గీతం పాడమన్నది కేంద్రం కాదనీ... సుప్రీమ్ కోర్టు నిర్ణయాన్ని కూడా పవన్ వ్యతిరేకిస్తాడా అని సెటైర్లు వేస్తున్నారు. ఇక ప్రత్యేక హోదా విషయంలో అయితే కమలం పార్టీ వద్ద కానీ, ఆ పార్టీ ఫాలోవర్స్ వద్ద కాని ఎలాంటి యాన్సర్ లేదు. అలాంటి సమయాల్లోనే ఆయన మీద వ్యక్తిగత దూషణలకి కూడా దిగుతున్నారు. ఆయన మూడు పెళ్లిల్ల గురించి, ఫ్లాప్ సినిమాల గురించి వగైరా వగైరాల గురించి డిస్కస్ చేస్తున్నారు!
సోషల్ మీడియాలో పవన్ కు వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రచారం ఒక ఎత్తైతే రియల్ గా మాత్రం ఎవ్వరూ ఇంత వరకూ ఘాటుగా స్పందించలేదు. మరీ ముఖ్యంగా, పవర్ స్టార్ పవర్ ఫుల్ దాడికి టార్గెట్ అయిన బీజేపి ఒక్క మాట కూడా అనటం లేదు. హోదా బదులు ప్యాకేజ్ ఇచ్చిన కమలం పార్టీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో మరోసారి చెప్పాల్సిన అవసరం వుంది. అలాగే, పవన్ కళ్యాణ్ కేవలం తమ ఒక్క పార్టీనే టార్గెట్ చేసి ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపీని, రాష్ట్రాన్ని ఏలుతోన్న పాలక పక్షాన్ని పల్లెత్తు మాట అనకపోవటాన్ని రాష్ట్ర బీజేపి గమనిస్తున్నట్టు లేదు! గమనించినా ఇప్పుడు అనువుగాని టైం అనుకుని ఊరకుండిపోతుందో ఏమో? కాని, దేశంలోనే అతి పెద్ద పార్టీ అయిన కాషాయదళం బాగా ఫాలోయింగ్ వున్న హీరో చేత తిట్లు పడుతూ కామ్ గా వుండటం ... ముందు ముందు ప్రమాదకరమే! అందుకే, తెలుగు రాష్ట్రాల్లోని బీజేపి అభిమానులు, మోదీ ఫాలోవర్స్ పవన్ ట్విట్టర్ దాడితో లోలోన రగిలిపోతున్నారు. కాని, ఢిల్లీ నేతలు మాత్రం గల్లీ బీజేపి నాయకుల్ని పవన్ పై ప్రతి దాడికి ఇంకా ఆదేశించటం లేదు! మొత్తానికి పవన్ కి చెలగాటం... బీజేపి ఫ్యాన్స్ కు ప్రాణ సంకటం అన్నట్టు తయారైంది పరిస్థితి!