పార్లమెంటు వేదికగా విపక్షాల ఐక్య పోరాటానికి టీఆర్ఎస్ వ్యూహం

సోమవారం (జులై 18) నుంచి పార్లమంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సారి పార్లమెంటు సమావేశాలలో టీఆర్ఎస్ ఎంపీల నిరసనలు మరో స్థాయిలో ఉంటాయని తెరాస వర్గాలు చెబుతున్నాయి. గతంలోలా రాష్ట్ర్ర సమస్యలపై ఒంటరిగా పార్లమెంటులోనూ, పార్లమెంటు ఆవరణలోనూ నిరసనలు తెలపడం, వాకౌట్ చేయడంతో సరిపుచ్చేయకుండా.. బీజేపీయేతర సభ్యుల మద్దతుతో తమ గొంతు బలంగా వినిపించాలని టీఆర్ఎస్ ఎంపీలు భావిస్తున్నారు.

తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా శనివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆ దిశగానే వారికి దిశా నిర్దేశం చేశారు. గతంలోలా నిరసన గళం వినిపించి సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోతే దేశ వ్యాప్తంగా తెరాస వాణి వినిపించే అవకాశాన్ని కోల్పోయినట్లే అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణకు నష్టం చేసేలా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పార్లమెంటు వేదికగా దేశం దృష్టిని ఆకర్షించేలా తెరాస సభ్యుల నిరసనలు ఉండాలని ఆయన భావిస్తున్నారు.

ఇందుకు  బీజేపీయేతర పార్టీల సభ్యుల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన బీజేపీయేతర పార్టీల నేతలతో ఫోన్ లో సంభాషించారు.  పార్లమెంట్‌లో కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ గట్టిగా గళమెత్తాలనీ సస్పెన్షన్ వేటు వేసినా వెనుకడుగు వేయవద్దని కేసీఆర్ ఎంపీలకు దిశా నిర్దేశం చేసినట్లు చెబుతున్నారు.  తెలంగాణ అభివృద్థిని ఓర్వలేకే కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్నదనీ, కేంద్రం తెలంగాణ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదనీ పార్లమెంటు వేదికగా దేశం మొత్తం తెలిసేనా టీఆర్ఎస్ సభ్యులు గళమెత్తాలని కేసీఆర్ ఎంపీలకు చెప్పారు.

తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చింది ఎంత? కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులెన్ని వంటి అంశాలను గణాంకాలతో సహా పార్లమెంటులో వినిపించాలని కేసీఆర్ వారిని ఆదేశించారు.  ధాన్యాన్ని కొనకుండా రైతులను, మిల్లర్లను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న తీరుపై పోరాడాలని  ఈ విషయంలో తెలంగాణ ఎంపీలకు మద్దతుగా నిలవాలని ఆయన బీజేపీయేతర పక్షాల నేతలను కోరారు. ఇందు కోసం ఆయన  విపక్ష నేతలతో శుక్రవారమే  ఫోన్లో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, బిహార్లోని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ యాదవ్‌, ఇతర జాతీయ విపక్ష నేతలతో చర్చలు జరిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆస్పత్రిలో ఉన్నందున ఆయన సన్నిహితులతో మాట్లాడారు.