బీఆర్ఎస్ కూడా కేటీఆర్ అరెస్టు కోరుకుంటోందా?

ఓడలు బళ్లు..బళ్లు ఓడలు అవుతాయనడానికి ప్రస్తుతం మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎదుర్కొంటున్న పరిస్థితి ఓ ఉదాహరణ. ఏడాది కిందటి వరకూ డీఫాక్టో సీఎంగా రాష్ట్రంలో చక్రం తిప్పిన ఆయన ప్రస్తుతం ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్టయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. పార్టీ కూడా ఆయన అరెస్టునే కోరుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే కేటీఆర్ అరెస్టైతే.. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ బీఆర్ఎస్ లో గట్టిగా ఉంది. ఇందుకు వారు గతంలో జరిగిన సంఘటనలను ఉదహరిస్తున్నారు.  

ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు ముంగిట ఉన్నారా అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి జరిగిందనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయంటూ తెలంగాణ హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ ను మంగళవారం (జనవరి 7) కొట్టివేసిన క్షణం నుంచీ కేటీఆర్ ఆరెస్టుపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. హైకోర్టు న్యాయవాది ఒకరు అయితే బుధవారం సాయంత్రానికే కేటీఆర్ అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన తరువాత ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థల కార్యాలయాలలో సోదాలు నిర్వహించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ గ్రీన్ కో కార్యాలయాలపై తెలంగాణ ఏసీబీ సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వీధీనం చేసుకుంది. మరో వైపు ఈడీ కూడా ఇలా కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయగానే అలా కేటీఆర్ కు ఈ నెల 16న విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపించింది. మరో వైపు ఏసీబీ కూడా కేటీఆర్ కు ఈ నెల 9న విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులలో కేటీఆర్ న్యాయవాదులను అనుమతించేది లేదని స్పష్టంగా పేర్కొంది. ఇక కేటీఆర్ హైకోర్టు తన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయిస్తే.. అంతకంటే ముందే రేవంత్ సర్కార్ సుప్రీంలో కేవియెట్ దాఖలు చేసింది. ఇలా కేటీఆర్ అరెస్టు అనివార్యం అన్నట్లుగా వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 

సాధారణంగా కేటీఆర్ అరెస్టును ఆయన ప్రత్యర్థి పార్టీల నేతలు కోరుకోవడం సహజం. పైగా ఓటుకు నోటు కేసులో గతంలో రేవంత్ ను అప్పటి కేసీఆర్ సర్కార్ అరెస్టు చేసింది. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసులో కేసీఆర్ అరెస్టుతో రేవంత్ కేసీఆర్, కేటీఆర్ పై ప్రతీకారం తీర్చుకున్నట్లు కూడా అవుతుంది. అయితే విషాదం ఏమిటంటే బీఆర్ఎస్ కూడా కేటీఆర్ అరెస్టును కోరుకుంటోంది. అయితే బీఆర్ఎస్ కేటీఆర్ అరెస్టును కోరుకోవడానికి కారణం వేరు. కేటీఆర్ అరెస్టైతే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ కారణంగా బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ కేటీఆర్ అరెస్టు కావాలనే కోరుకుంటున్నారు. 

గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వారసుడిగా కేటీఆర్ ను సీఎంను చేసి ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టిపెడతారన్న ప్రచారం జోరుగా సాగింది. కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కేటీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమోషన్ ఇవ్వడానికి కూడా కారణం అదేనని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఆ సమయంలో పార్టీ మొత్తం కేటీఆర్ కు మద్దతుగా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పార్టీలోని చాలా మంది కేటీఆర్ కంటే హరీష్ రావు, కల్వకుంట్ల కవితలలో ఎవరో ఒకరు కేసీఆర్ రాజకీయవారసులుగా ఉండాలని భావిస్తున్నారు.

పార్టీలో అలా కోరుకుంటున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద ప్రత్యర్థి పార్టీలతో పాటు సొంత పార్టీ కూడా కేటీఆర్ అరెస్టునే కోరుకుంటున్న పరిస్థితి. ఏడాది కిందటి వరకూ డిఫాక్టో సీఎంగా చక్రం తిప్పిన కేటీఆర్.. ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి నిజంగా అవమానకరమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.