సోమవారం నుంచి నిర్మాతల సమ్మె.. షూటింగ్ లు బంద్

తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్మాతలు సమ్మె బాట పట్టారు. సోమవారం నుంచి షూటింగ్ లు బంద్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ సినీ కార్మికులు వేతనాల పెంపు డిమాండ్ తోనో.. ఇతర భాషల నుంచి టెక్నీషియన్లకు ఎక్కువ అవకాశాలిస్తున్నారనో సమ్మె చేయడం తెలుసు కానీ ఎన్నడూ నిర్మాతలే సమ్మె బాట పట్టి షూటింగ్ లు నిలిపివేయాలని నిర్ణయించడం మాత్రం ఇదే మొదటి సారి.

శనివారం జరిగిన నిర్మాతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మూతపడుతున్న సినిమాహాళ్లు, పెరిగిపోతున్న హీరోల పారితోషకాలు, ఓటీటీల వల్ల పడిపోతున్న కలక్షన్ల ఇలా పలు అంశాలపై చర్చించారు. చివరికి సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకూ సినిమా షూటింగ్ లు బంద్ చేయడమే బెటర్ అని నిర్ణయానికి వచ్చారు.

ఆ నిర్ణయాన్ని సోమవారం నుంచి అమలు చేయాలని తీర్మానించారు. అదే జరిగితే సినిమా రంగంపై ఆధారపడిన కార్మికులు కష్టాల్లో పడతారనడంలో సందేహం లేదు. అయితే నిర్మాతల సమ్మె నిర్ణయం మాత్రం ఒక సంచలనంగా మారింది.