వదలని వానలు.. మరో రెండ్రోజులు భారీ వర్షాలు

తెలంగాణకు వానలు విడవనంటున్నాయి. రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశముంది హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. జులై 17, 18 తేదీలతో తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది.  ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌,  వరంగల్‌, ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.   శనివారం కూడా తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.   

ఇలా ఉండగా వరద ప్రభావిత ప్రాంతాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఏరియల్  సర్వే నిర్వహించనున్నారు. అలాగే ముంపు ప్రాంతాలలో పర్యటిస్తారు. భద్రాచలం, నిజామాబాద్, ఆదిలాబాద్  జిల్లాలలో ఆయన ఏరియల్ సర్వే  నిర్వహిస్తారు.  మరో వైపే గవర్నర్ తమిళిసై కూడా కొత్తగూడెం పరిసర ప్రాంతాలలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నారు. శనివారం రాత్రే ఆమె రైలులో కొత్తగూడెం కు బయలు దేరారు.

వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి వరద బాధితులకు అందుతున్న సాయంపై ఆమె బాధితుల నుంచి వివరాలు తెలుసుకుంటారు. ముంపు ప్రాంతాల పర్యటన కోసం గవర్నర్ తమిళిసై తన హస్తిన పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. తమిళిసై ముంపు ప్రాంతాల పర్యటనపై రాజ్ భవన్ నుంచి ప్రకటన వెలువడిన అనంతరం సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేయనున్నట్లు  సీఎం కార్యాలయం ప్రకటించింది.   దీంతో రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య దూరం ఏ మాత్రం తగ్గలేదని రాజకీయ వర్గాలలో చర్చకు తెర లేచింది.