పులులు కాదు పిల్లులు.. గంట క‌ళ్లు మూసుకుంటే.. మాకూ బీపీ.. టాప్‌న్యూస్ @7pm

1. కొన్ని పిల్లులు తాము పుల‌ల‌మ‌నుకుంటున్నాయి.. మా పార్టీ ఆఫీసులో ప‌గిలింది అద్దాలు మాత్ర‌మే.. మా కార్య‌క‌ర్త‌ల గుండెల‌ను మీరు గాయ‌ప‌ర‌చ‌లేరు.. ఒక చెంప మీద కొడితే రెండు చెంప‌లు వాయ‌గొడ‌తాం.. అంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ వైసీపీని తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. ప‌సుపు జెండా చూస్తే వైసీపీ శ్రేణుల‌కు ఎందుకంత భ‌య‌మ‌ని ప్ర‌శ్నించారు. ఏపీలో గంజాయి దందా బాగా న‌డుస్తోంది.. దీనిపై నిల‌దీస్తే టీడీపీ కార్యాల‌యంపై దాడి చేశార‌ని మండిప‌డ్డారు. ఏపీ సీఎంగా మ‌ళ్లీ చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం ఖాయ‌మ‌న్నారు నారా లోకేశ్‌. 

2. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయ‌న‌ గంట కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామంటూ పరిటాల సునీత వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘మాలో ప్రవహించేది సీమ రక్తమే’’ అన్నారు. తన భర్తను చంపినప్పుడు కూడా ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామని.. ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదని హెచ్చ‌రించారు. ఇక‌నైనా చంద్రబాబు తీరు మారాల‌న్నారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు చూపిస్తామని పరిటాల సునీత గ‌ట్టిగా హెచ్చరించారు. 

3. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష స్థానానికి నామినేషన్ల గడువు ముగిసింది. కేసీఆర్ పేరును బలపరుస్తూ మొత్తం 18 నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో కేసీఆర్ ఎన్నిక లాంఛనమే కానుంది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష స్థానానికి వచ్చిన నామినేషన్లను శనివారం పరిశీలిస్తారు. ఈ నెల 25న టీఆర్ఎస్ ప్లీనరీ జరుగనుంది. ప్లీనరీలో టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 వసంతాలు కావడంతో 25న పార్టీ తరపున ద్విదశాబ్ది ఉత్సవాలను నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 

4. టీడీపీ ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ సీఎం జ‌గ‌న్‌రెడ్డితో పాటు మంత్రుల‌పై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. ‘‘మంత్రి పదవి కోసమే ఇన్నాళ్లూ కొడాలి నాని టీడీపీ నేతలను తిట్టారు. త్వరలోనే ఆయన పదవి పోవడం ఖాయం. జగన్‌కే కాదు.. గాడ్సేకు కూడా అభిమానులున్నారు. మేమూ ఉప్పూకారం తింటున్నాం.. మాకూ బీపీ వస్తుంది’’ అని చింతమనేని ప్రభాకర్ హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ఎన్నికల జరగాల్సిన స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ ఇస్తే వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తామన్నారు చింతమనేని. 

5. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలని కోరుతూ నవంబర్ 1 నుంచి రైతులు మహా పాదయాత్ర చేప‌డుతున్నారు. తుళ్లూరు గ్రామం నుంచి తిరుమల వరకు 45 రోజుల పాటు పాద‌యాత్ర కొన‌సాగనుంది. డిసెంబర్ 17వ తేదీతో పాదయాత్ర ముగియనుంది. మహా పాదయాత్రకు పలు పార్టీల మద్దతు కూడ‌గ‌డుతున్నారు. తాజాగా, మహా పాదయాత్రకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతును రాజధాని రైతుల ప్రతినిధులు కోరారు. శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ను రైతులు కలిసారు.

6. న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు గతేడాది నవంబర్‌ 11న దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 16 మందిపై 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. విదేశాల్లో ఉన్న నిందితులపై ఏవిధంగా చర్యలు తీసుకోవాలో చూడాలని గతంలో హైకోర్టు ఆదేశించ‌గా.. ఆ దిశగా సీబీఐ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

7. చిత్తూరు జిల్లాలో వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో చంద్రబాబుపై రెస్కో చైర్మన్‌ జీఎస్‌ సెంథిల్‌కుమార్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ‘చంద్రబాబూ.. కుప్పం వస్తే కారు మీద బాంబు వేస్తా.. దమ్ముంటే కుప్పంకి రా రా..’ అంటూ బ‌రితెగింపు మాట‌లు మాట్లాడారు. ఎంపీ రెడ్డెప్ప సమక్షంలోనే ఇలా రెచ్చిపోయారు. చంద్ర‌బాబుపై వైసీపీ లీడ‌ర్ సెంథిల్‌కుమార్ చేసిన తీవ్ర వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సెంథిల్‌కుమార్‌పై టీడీపీ శ్రేణులు భ‌గ్గు మంటున్నాయి.

8. అమ్మను వదిలేసినవాడు అమ్మఒడి ఇస్తాడా? అని అమరావతి జేఏసీ అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘‘చెల్లిని వదిలేసిన వాడికి సెంటిమెంట్స్ ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి తన సమాధిని తానే కట్టుకుంటున్నాడు. అరాచకంతో అధికారంలోకి వచ్చిన ఏ నాయకుడూ పూర్తికాలం అధికారంలో లేడు. ఈరోజు నుంచి సీఎం జగన్ గంజాయి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చినవారే సమాధి చేస్తారు. తాడేపల్లి నుంచి తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్ కోసం ప్రజలంతా తిరగబడాలి. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు జగన్ అరాచకాన్ని సృష్టించాడు’’ అని కొలికపూడి మండిప‌డ్డారు. 

9. తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. నవంబర్, డిసెంబర్ నెల‌లకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టికెట్లను ఆన్‌లైన్లో ఉంచింది. రోజుకి 12 వేల చొప్పున 7.8 లక్షల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. అయితే, నాలుగు గంటల్లోనే ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయి. ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయంతో టీటీడీకి 21 కోట్ల రాబడి వచ్చింది. 

10. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో 100 కోట్ల మైలురాయిని అధిగ‌మించిన సంద‌ర్భంగా ఈ ప్రయాణాన్ని ‘ఆందోళన నుంచి భరోసా’ వరకు అని ప్ర‌ధాని మోదీ అభివర్ణించారు. ‘‘దాదాపు 100 ఏళ్ల తర్వాత మానవాళి ఇంతటి ఘోరమైన మహమ్మారిని ఎదుర్కొంటోంది. కన్పించని శత్రువు వేగంగా పాకుతుంటే ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితుల్లో పడిపోయాం. అలాంటి ఆందోళనల నుంచి బయటపడి టీకాలు తయారుచేసుకున్నాం. ఇప్పుడు 100 కోట్ల మైలురాయిని దాటుకుని మహమ్మారి నుంచి బయటపడగలమనే భరోసా ఇవ్వగలుగుతున్నాం. ఈ ప్రయాణంతో మనం మరింత బలంగా మారాం. దీని కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని మోదీ అన్నారు.