కొన్ని పిల్లులు పులులమని భావిస్తున్నాయి.. అసలు సినిమా ముందుంది.. లోకేశ్ ఫైర్
posted on Oct 22, 2021 6:08PM
మా పార్టీ ఆఫీసులో పగిలింది అద్దాలు మాత్రమే.. మా కార్యకర్తల గుండెలను మీరు గాయపరచలేరు.. ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు వాయగొడతాం.. అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. పసుపు జెండా చూస్తే వైసీపీ శ్రేణులకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. ఏపీలో గంజాయి దందా బాగా నడుస్తోంది.. దీనిపై నిలదీస్తే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని మండిపడ్డారు. ఏపీ సీఎంగా మళ్లీ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు నారా లోకేశ్.
వైసీపీ దాడులను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష క్లైమాక్స్‌కు చేరింది. మంగళగిరి ఎన్టీఆర్‌భవన్‌కు రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క పరిశ్రమ రాకపోయినా.. రాష్ట్రంలో గంజాయి పరిశ్రమ మాత్రం బాగా నడుస్తోందని విమర్శించారు. గంజాయితో యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని నిలదీస్తే టీడీపీ ఆఫీసులపై దాడులు చేశారని విమర్శించారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించడం దారుణమన్నారు. ఎవరూ లేని సమయంలో వైసీపీ మూకలు దాడిచేశారు.. దమ్ముంటే ఇప్పడు రావాలని సవాల్ విసిరారు నారా లోకేశ్.
చట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వారు ఎక్కడున్నా రాబోయే రోజుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని లోకేశ్ హెచ్చరించారు. ‘‘పసుపు జెండా చూస్తే మీకు ఎందుకంత భయం. కొన్ని పిల్లులు.. పులులమని భావిస్తున్నాయి. మా ఆఫీసులో పగిలింది అద్దాలు మాత్రమే.. మా కార్యకర్తల గుండెలు మీరు గాయపరచలేరు. టీడీపీ కార్యకర్తలు కేసులకు భయపడక్కర్లేదు. ఒక చెంప మీద కొడితే .. రెండు చెంపలు వాయగొడతాం. జగన్‌రెడ్డిలా నేను చిన్నాన్న జోలికి వెళ్లలేదు. జగన్ మగాడైతే చిన్నాన్న హత్య కేసు తేల్చాలి. రెండున్నరేళ్లు ఆగండి.. చంద్రబాబే మళ్లీ సీఎం. 2024లో మంగళగిరిలో టీడీపీని గెలిపించి కానుకగా ఇస్తా. వైసీపీకి ట్రైలర్ మాత్రమే చూపించాం.. సినిమా ముందుంది’’ అంటూ లోకేశ్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.