దొరగారు కొడుకుని సింహాసనం ఎక్కించబోతున్నారా?



అనగనగా ఒక పెద్ద  సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో మనం చెప్పుకోబోతున్న రాజ్యం ఒక భాగం. ఆ రాజ్యాన్ని ఒక దొరగారు పరిపాలిస్తున్నారు. సదరు దొరగారు ఈ రాజ్యం మీద అధికారాన్ని చాలా తెలివిగా ప్లాన్ వేసి సంపాదించారు. అధికారం సంపాదించిన దగ్గర్నుంచి దొరగారు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా నడుస్తోంది. హిట్లర్, ముస్సోలినీ తరహాలో చాలా నియంతృత్వంతో దొరగారు పరిపాలిస్తున్నారని విమర్శలు వస్తున్నా దొరగారు ఎంతమాత్రం పట్టించుకుండా తన శైలిలోనే పరిపాలిస్తున్నారు. దొరగారికి తగ్గ పాలకులు ఆయన కుమారుడు, అల్లుడుగారు కూడా. వాళ్ళిద్దరూ దొరగారి మంత్రివర్గంలోనే వున్నారు. అంతా బాగానే వుందిగానీ, దొరగారి కొడుక్కి, అల్లుడిగారికి ఒకరంటే మరొకరికి ఎంతమాత్రం పడదు. ఎంత పడదూ అంటే... ఇద్దరూ కలసి ఒకే వేదిక మీద కనిపించడానికి కూడా ఇష్టపడనంత పడదు. ఎందుకంటే దొరగారి తర్వాత సింహాసనం నేను ఎక్కాలంటే నేను ఎక్కాలని ఇద్దరి మధ్య పోటీ. ఫ్యూచర్లో సింహాసనం ఎక్కడానికి ఇప్పటి నుంచి ఎవరి ప్లాన్లో వాళ్ళు వున్నారు. దొరగారికి మాత్రం తన కొడుకునే తన సింహాసనం ఇవ్వాలనేది కోరిక. కానీ ఒకవేళ పుసుక్కుమని తనకి ఏమైనా జరిగితే అల్లుడు గారు చాలా ఘటికుడు కావడం వల్ల తన కొడుక్కి సింహాసనం దక్కకుండా చేస్తాడేమోనని దొరగారికి మనసులో డౌటుంది. అందుకని తన సింహాసనం తన కొడుక్కే దక్కేలాగా దొరగారు ఒక ప్లాన్ సిద్ధం చేశారని వినికిడి.

ప్రస్తుతం సింహాసనం మీద వున్న దొరగారు అంతా బాగా వుండగానే వన్ ఫైన్ మార్నింగ్ సింహాసనం మీద నుంచి కిందకి దిగిపోతారు. ఆ సింహాసనం మీద తానే స్వయంగా తన కొడుకుని కూర్చోబెడతారని సమాచారం. అంతా బాగున్నప్పుడే ఇలా అధికారాన్ని తన కొడుకు చేతిలో పెట్టడం వల్ల తన అల్లుడు కూడా కిక్కురుమనకుండా వుంటాడనేది దొరవారి ప్లాన్ అని సమాచారం. వేరే రాజ్యంలో కూడా ఒక రాజుగారు ఇలాగే తనకు అంతా బాగానే వున్న సమయంలోనే తాను సింహాసనం మీద కూర్చోకుండా తన కొడుకుని కూర్చోబెట్టాడు. తన కొడుకు సింహాసనం మీద కూర్చుని అధికారం చెలాయిస్తూ వుంటే సదరు రాజు ఒక తండ్రిగా ఎంతో సంతోషిస్తున్నాడు. అదే తరహాలో ఇప్పుడు మన కథలోని దొరగారు కూడా తన కొడుకు సింహాసనం మీద కూర్చుని అధికారం చెలాయిస్తూ వుంటే తాను చూసి సంతోషించాలని అనుకుంటున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి దొరగారు ఈ ఆలోచనను అమలులో పెట్టే ఫైన్ మార్నింగ్ ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu