గంగిరెడ్డి దొరికాడు.. ఇక దొరకాల్సింది....
posted on Nov 18, 2015 2:23PM

కరడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్, చంద్రబాబు మీద జరిగిన అలిపిరి దాడి కుట్రలో భాగస్వామిగా వున్న గంగిరెడ్డి ఎట్టకేలకు దొరికాడు. వందల కోట్ల ఆస్తులు వున్నా, ఏపీలో ప్రముఖ రాజకీయ నాయకుడి అండ వున్నా, విదేశాలకు పారిపోయినా చివరికి గంగిరెడ్డి దొరకక తప్పలేదు. మారిషస్‌లో హాయిగా రెస్టు తీసుకుంటున్న గంగిరెడ్డి ఎట్టకేలకు పట్టుబడి ఏపీ పోలీసుల చేతికి చిక్కాడు. మీడియా ముందు హాజరుపరిచిన సమయంలో గంగిరెడ్డి అమాయకంగా మాట్లాడిన మాటలు విన్నవాళ్ళెవరైనా పాపం ఇంత అమాయకుడా అనుకుంటారు. అయితే గంగిరెడ్డి స్మగ్లింగ్ లీలల గురించి, అతని నేర చరిత్ర గురించి చెప్పాలంటే ఒక పెద్ద గ్రంథమే రాయాల్సి వుంటుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
అయితే గంగిరెడ్డి దొరికాడు కదా అని సంబరపడిపోవాల్సిందేమీ లేదని పరిశీలకులు అంటున్నారు. గంగిరెడ్డి పోలీసులకు దొరకడం ఇదేమీ మొదటిసారి కాదు.. గతంలో దొరికినా ఎంచక్కా బెయిల్ తీసుకుని విదేశాలకు చెక్కేశాడు. ఇప్పుడు మళ్ళీ దొరికిన గంగిరెడ్డి మరోసారి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి గంగిరెడ్డి బెయిల్ పుచ్చుకున్నాడంటే అతగాడిని మళ్ళీ పట్టుకోవడం హరిహర బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే గంగిరెడ్డిని పట్టుకోవడానికి ప్రభుత్వానికి ఖర్చు తడిసి మోపెడైందని సమాచారం. మళ్ళీ గంగిరెడ్డి ఇంకోసారి తప్పించుకుంటే పోలీసులు చేతులు ఎత్తేయడం తప్ప ఇక చేయగలిగిందేమీ లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
అందుకే, ఈసారి అయినా గంగిరెడ్డి తప్పించుకోకుండా పోలీసులు పకడ్బందీగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. గంగిరెడ్డిని పట్టుకుని శిక్షిస్తే మాత్రమే సరిపోదని, గంగిరెడ్డిని ముందు వుంచి నడిపిస్తున్న ఆ ‘అజ్ఞాత రాజకీయ శక్తి’ని కూడా చట్టం ముందు దోషిగా నిలబెట్టాల్సిన అవసరం వుందని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు గంగిరెడ్డి దొరికిపోయాడు. ఇక దొరకాల్సిన ఆ రాజకీయ శక్తి కూడా దొరికిపోతే ఎర్రచందనం స్మగ్లింగ్‌కి భారీస్థాయిలో అడ్డుకట్ట పడే అవకాశం వుందని అంటున్నారు..