ఇది వైసీపీ ఎన్నికల టీం
posted on Apr 10, 2023 10:00AM
రాష్ట్ర విభజన అనతరం ఎవరూ ఊహించని విధంగా అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ తొలి సారిగా భారీఎత్తున ఐఏఎస్ ల బదిలీలు జరగడం రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాల అనంతరం బదిలీలు జరుగుతాయని అందరూ ఊహించారు. అయితే కొందరు అధికారులపై మంత్రులు, ఎమ్మెల్యేలు పిర్యాదు చేయడం, అనంతరం ఈ నెల మూడో తేదీన జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో అధికారుల తీరుపై సీఎం వద్ద తమ అసంతృప్తి వ్యక్తం చేయడంతో బదిలీల జాబితాలో భారీ మార్పులు, చేర్పులు జరిగినట్లు సమాచారం.
ఈసారి బదిలీల్లో కొందరు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు ప్రాధాన్యత కల్పించినట్లు చెబుతున్నారు. అంతేగాకుండా మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉండేందుకు ఎన్నికల టీంను నియమించారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికల దిశగా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకుని పార్టీ ప్రభుత్వంలో మార్పు లకు శ్రీకారం చుట్టారు. పాలనలో ప్రక్షాళన ప్రారంభించారు. ఈసారి సీనియర్, జూనియర్ అధికారులందరికీ స్థాన చలనం కలిగింది.
అయితే కొందరు జూనియర్లకు బదిలీల్లో ప్రాధాన్యత లభించగా, కొందరు సీనియర్లకు ఆప్రధాన్యత పోస్టులు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా గవర్నర్కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్.పి. సిసోడియాను ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా అప్రాధాన్య పోస్టులో ప్రభుత్వం నియమించిందని పలువురు భావిస్తున్నారు. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను సాగనంపే క్రమంలో ఇదే తరహాలో బదిలీ జరిగినట్లు ఐఎఎస్ అధికారులు గుర్తు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణ అప్పటి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి జీతాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. సూర్య నారాయణతో పాటు ఉద్యోగులకు సిసోడియానే గవర్నర్ అపాయింట్ ఇప్పించారు.
అప్పటికే బదిలీల జాబితా సిద్ధం అయినా విడుదల చేయలేదు. అపాయింట్మెంట్ ఇప్పించారన్న కారణంతో ప్రభుత్వం ఆయనను బదిలీ చేసిందని, ఆ సమయంలో ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరిగింది. అదే విధంగా దేవదాయ శాఖ కమిషనర్ గా ఉన్న ఎం.హరిజవర్ లాల్ కు కార్మిక శాఖ కార్య దర్శిగా.. అంతగా ప్రాధాన్యం లేని పోస్టులోకి బదిలీ చేసారు. పాత గుంటూరులోని ఒక ఆలయానికి చెందిన రెండెకరాలకు.... ఎన్ఓసీ ఉత్తర్వులివ్వడం వివాదాస్పదమైంది. దానిపై తీవ్రంగా మండిపడిన హైకోర్టు... ఆయన ఆ పోస్టుకే అర్హుడు కాదని వ్యాఖ్యా నించింది. అయితే హరిజవర్ లాల్ దేవాదాయశాఖలో సమర్థవంతం గా పనిచేసినా ఆయనకు ప్రాధాన్యత లేని శాఖను కేటాయించడం చర్చనీయాంశం అయింది.
అలాగే శేషగిరిబాబును కార్మికశాఖ కమిషనర్ గా ప్రాధాన్యత లేని శాఖలకు నియమించడంపై కూడా చర్చ జరుగుతోంది. అదే విధంగా ఎంఎల్సీ ఎన్నికల సందర్భంగా అనంతపురం కలెక్టర్ నాగలక్ష్మి రీ కౌంటింగ్ కు అనుమతి ఇవ్వలేదని అక్కడి అధికార పార్టీ నేతలు సీఎంకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమెను విజయనగరం కలెక్టర్ గా పంపినట్లు చెటుతున్నారు. అయితే అక్కడ కలెక్టర్ గా పనిచేసిన సూర్యకుమారిని కీలకమైన పంచాయితీ రాజ్ కమిషనర్ గా పదోన్నతి లభించింది. ఎనిమిది జిల్లాల కలెక్టర్లను మార్పు చేయగా ఇద్దరిని వేరే జిల్లాలకు
కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను బాపట్ల కలెక్టర్ గా బదిలీ చేశారు. బదిలీల్లో కీలక మైన దేవాదాయశాఖ, పంచాయితీ రాజ్ శాఖలతో పాటు స్కిల్ డెవల్పమెంట్ కార్పొరేషన్.. జెన్కో ట్రాన్స్కో, ఇంటర్ బోర్డు తదితర శాఖల అధికారులుకూ స్థాన చలనం కలిగింది. కాగా ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్దం అయింది. ఇప్పటికే ఎస్పీ స్థాయి నుంచి ఐజీ ర్యాంకు అధికారుల బదిలీల జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో ఐపీఎస్ జాబితా విడుదల కానున్నది.
రాష్ట్రంలో రోజు రోజుకు తన గ్రాఫ్ పడిపోతున్న విషయాన్ని గమనించిన సీఎం జగన్.. మరో ఏడాది కాలంలో జరగనున్న ఎన్నికలై ఇప్పటి నుంచే దృష్టి పెట్టరని పరిశీలకులు భావిస్తున్నారు. అనననుకూల పరిస్థితులను అనుకూలంగా మర్చడంలో జగన్ సామర్థ్యం తెలియంది కాదు.. అందుకనే ఈ కసరత్తులనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..